3 August, 2026 | 1:40 AM

‘వృ త్తి’గత కావ్యం ‘అసిపె’

03-08-2026 12:39 AM

సమకాలీన సాహిత్యంలో ముఖ్యంగా ఆధునిక అస్తిత్వవాద తెలుగు కవిత్వంలో బహుజన గొంతును తన కవిత్వం ద్వారా బలంగా వినిపించడమే కాక, ఇతర కవులు రాసిన బహుజన కవిత్వాన్ని సంకలనాలుగా ప్రచురిస్తూ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న సహజ కవి వనపట్ల సుబ్బయ్య. బహుజన సంస్కర్త మహాత్మ జ్యోతిబాఫూలేపై ఉన్న అభిమానంతో ‘బహుజన బావుటా’ అనే దీర్ఘకవితను ప్రచురించడమే కాక, దాదాపు 157 మంది కవులతో తొలిసారిగా ఫూలేపై కవిత్వం రాయించి ‘ధిక్కార’ అనే కవితా సంకలనాన్ని చరిత్రకారుడు,

కవి డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి ప్రచురించటం తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప మైలురాయి. ‘కుర్చీ’ అనే బహుజన దీర్ఘకవితతో మొదలైన ఆయన వృత్తి జీవిత ప్రామాణిక దీర్ఘ కవిత్వప్రయాణం ఈ మధ్యనే వచ్చిన‘పసరంటిన కొడవలి’, ‘అసిపె’ వరకు సాగింది. 2001లో వచ్చిన ‘వెంటాడే కలాలు’ (వెనుకబడిన కులాలు) అనే బీసీ వాద కవిత్వసంకలనం ఇచ్చిన బహుజన స్ఫూర్తితో ఎంతోమంది బహుజన కవులు తమ ఉనికిని తాము తెలుసుకొని చరిత్ర పుటల్లో మరుగున పడిన కుల వృత్తుల్ని,ఆ వృత్తుల్లోని కళా నైపుణ్యాల్ని, వాళ్ల జీవితాల్లోని కన్నీటి గాథల్ని వృత్తి కవిత్వంగా వినిపించటం ఈనాటి తెలుగు కవిత్వంలో వచ్చిన గొప్ప మలుపు అని చెప్పుకోవచ్చు. బహుజన కవుల ఆలోచనా విధానాల్నే కాక,

కవిత్వ పరిభాషను కూడా మలుపు తిప్పిన చారిత్రక స్ఫూర్తివంతమైన కవిత్వ సంకలనం ‘వెంటాడేకలాలు’ ఆ స్ఫూర్తిని అత్యంత చైతన్యవంతంగా ఆందిపుచ్చుకొని బీసీ కవిత్వాన్ని రాసున్న బీసీ కవుల్లో వనపట్ల ముందువరుసలో ఉంటాడు. బహుశా ‘అసిపె’ పురుడు పోసుకోవటానికి ఆ స్ఫూర్తే బలమైన కారణం కావొచ్చు. ఆ ‘అసిపె’ సుధీర్ఘ సాధికార దీర్ఘకవితను తన మంగలి కులవృత్తిని, అందులోని సాధక బాధకాల్ని, సుఖ దుఃఖాల్ని, భావోద్వేగాల్ని చాలా కవితాత్మకంగా ఆవిష్కరించాడు కవి.

అసిపే కవితను సుబ్బయ్య చూసి రాసింది కాదు, స్వతహాగా ఆ వృత్తినే చేస్తూ తన అనుభవాల్నే అక్షరాలుగా మలిచిన వ్యక్తిగత వృత్తి కవిత అది.ఈ మధ్య గన్నోజుప్రసాద్ రాసిన ‘కొలిమి’దీర్ఘకవితకూడాఆయన కమ్మరివత్తి చేసిన అనుభవంలోంచి రాసిందే. ‘అసిపె’ దీర్ఘకవిత సుబ్బయ్య నాయన మంగలిబాలయ్య నిత్యజీవన మహాగాథ. ఈ దీర్ఘ కవిత 25 భాగాల్లో విస్తరించిన మంగలి వృత్తి కళాకారుని బతుకు చిత్రాన్ని చిత్రికపట్టే ఆత్మకథనాథ్మక గౌరవ పతాక.

ఇది ఒక బాలయ్య జీవిత చరిత్రే కాదు, తండ్రి వృత్తి వారసత్వాన్ని కొనసాగిస్తున్న కొడుకు సుబ్బయ్య జీవిత చరిత్రకు కూడా దర్పణం. ఇది తెలంగాణ పల్లెల్లోని మంగలోళ్ల దుఃఖగాథ. ఈ ‘అసిపె’ సమాజంలో మంగలి వృత్తిదారుని అవసరాన్ని, ఆ వృత్తి ఔన్నత్యాన్ని చాటిచెప్పే కావ్యమాలిక. నిజానికి మనిషి పుట్టుక మొదలు చావు వరకు మంగలి వృత్తిదారుల పాత్ర అత్యంత కీలకమైనది. అటువంటి సబ్బండజాతి నుంచి వచ్చిన మంగలి కులం ప్రాధాన్యత గురించి, వాళ్ల నాయన అసిపే చేతపట్టుకుని వృత్తిని నమ్ముకొని పడిన కష్టాలను కవి కవితాత్మకంగా వర్ణిస్తాడు.

‘అసిపేనే మాయింటికి బువ్వ/ బతుకు బండి /మా జాతి జీవగర్ర, వెనుగర్ర/ ఆత్మగౌరవ పతాక/ కులవృత్తికికూరాడు/మా బతుకు పెట్టె/ అసిపేవాళ్ల ఎడారి బతుకులకు గుండె ధైర్యమై నిలిచి/ చీకటింటికి వెలుగు దీపమై/ బడుగు బతుకుల బండిని నడిపించే బతుకుపెట్టే/ ఆ పనిముట్లపెట్టే/ తూర్పున సూరీడు లేత కిరణాలకు/పొద్దు తిరుగుడు పూలు స్వాగతిస్తున్నట్లు/ సంకన పెట్టెతో బతుకు యుద్ధంలో/ మంగలి బాలయ్య సైనికునిలా నడుస్తాడని/ ఆయన చేతిలో అసిపె ఉంటే అశోకుడికి/ మగధ సామ్రాజ్యం చేతులున్నట్లే’ అని వాళ్ల నాయనను,

వాళ్ల వృత్తి ఔన్నత్యాన్ని పతాక స్థాయిలో వర్ణిస్తాడు. బాలయ్య సగరాలు గడ్డాలు చేయటంలోనే కాదు ‘ఊర్లో ఎవరి కాలులో ముల్లిరిగినా/ఆయన గోరుకాలే ఆయుధమై/ అరికాలుకు అడుగులోతు ముల్లున్నా/కొనముక్కుతో లేపంగనే మబ్బులను చీల్చే చిమ్మటం/ న్యాలబొక్కలోంచి పాము పిల్లలా బయటికీ తీస్తాడు’ అని ఆయన నేర్పును ఆ వృత్తిలో ఆయన చూపే ఓర్పును వర్ణిస్తాడు. ఎంత వృత్తిని నమ్ముకుని పనిచేసుకున్నా పూట గడవని బతుకులు మంగలోళ్లవి. అసలు వాస్తవానికి అన్నివృత్తి కులాల వాళ్ల పరిస్థితి ఇంతే..

రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు ఈ బడుగుబలహీన వర్గాల వాళ్లవి. అందుకే.. అసిపే చేత పట్టందే ఊర్లల్లోని సబ్బండ వర్గాల న్నీ ఐకమత్యంగా పరస్పరం సహయాన్ని అందించుకుంటూ కలిసి మెలిసి బతికేతీరును అసిపెలో ఇలా వర్ణిస్తాడు ఈ కవి. ‘ఊపిరితిత్తుల్నే తోలుతిత్తులుగా తాల్చి/ దేహాన్ని కొలిమి చేసి/ నల్లని బొగ్గులు ఎర్రెర్రని నిప్పు కణికల మీద/ సబ్బండ వత్తుల పనిముట్లను పొదిగే విశ్వకర్మలు/ కమ్మరి కొలిమే లేకపోతే మాచేతుల కత్తులు కత్తెర్లు లేవు’ అంటూ..

నిత్యం సబ్బండ వర్గాలకు వృత్తి పనులకు అవసరమైన పనిముట్లను చేసిచ్చే విశ్వకర్మ కమ్మరి వీరయ్యకు వందనాలు అంటాడు. నేను మంగలిని అని చెప్పుకోవటానికే న్యూనతగా భావించే ఈ ఆధునిక కాలంలో మంగలి వృత్తిని శిఖరాయమానంగా దీర్ఘకవితా రూ పంలో అందించడ మేకాక, ఇంతవరకు తమ కుల వృత్తుల గురించి రాయని బీసీ కవులెందరికో ప్రేరణగా నిలిచే ‘అసిపె’ను దిక్సూచిలా అల్లిన ఈ కృతికర్తకు అభినందనలు.