13 April, 2026 | 2:26 AM

బూడిద రంగు

13-04-2026 12:58 AM

నలుపునకు తెలుపునకు మధ్య

ఓ వర్ణం తచ్చాడుతూ ఉంటుంది

ఇంద్రధనుస్సు రంగుల్ని

అనుభవించిన కాలం

ఒళ్లంతా కళ్లు చేసుకుని

హత్తుకునీ హత్తుకునీ 

ప్రస్ఫుటమైన ప్రతిబింబాలను 

ఒకానొక అంతిమ ఘడియన

ఎలిసిపోయి రూపు మార్చుకుంటుంది

భ్రమలు భ్రమలుగా

రంగుల బలం 

లేని లోకంలో మనల్ని తిప్పుతుంది

స్థితప్రజ్ఞత హృదిని తట్టుకుంటే

వాస్తవికతను కోల్పోయి

కలల్ని నిజంగా ఊహిస్తాం

కొన్నిసార్లు ముగింపు తెలియని ఆట

చాలా ప్రమాదమై 

మనవైపే దూసుకు వస్తుంది

రంగూ రుచి లేని ప్రాణవాయువు

బతుకు పాఠాన్ని

బల్లగుద్ది నేర్పిపోతుంది

కొన్ని నేర్చుకోవటమంటే

మనల్ని మనం కోల్పోవడం కూడా

ఎండకు ఎండిపోయి

తన అస్తిత్వాన్ని కోల్పోయే వాటి పట్ల

నిర్దుష్టమైన మనసు రంగుతో

శాశ్వతవర్ణమై భాసించటం 

నేర్చుకోవాలి... అలవరుచుకోవాలి

దుఃఖపు తడి ఏ రంగునూ

నీ ముఖానికి అద్ది పోదు 

స్మశాన నిశ్శబ్దంలో

తనువంతా నిలువునా కుప్పవుతుంది

ఓ బూడిద రంగును మిగిల్చి !

 డాక్టర్ కటుకోఝ్వల రమేష్