7 July, 2026 | 9:42 PM

మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు గ్రీన్ సిగ్నల్

07-07-2026 08:26 PM

సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతల కృతజ్ఞతలు

అలంపూర్: తుమ్మిళ్ల లిఫ్ట్ పథకం కింద మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే డా. ఎస్.ఏ. సంపత్ కుమార్ చేసిన కృషి ఫలితంగానే ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి, మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన ఫైలు సిద్ధమైందని, భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సూచించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

దీంతో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్, కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏనముల నాగరాజు, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎల్.రెడ్డి, రాజోలి మండల అధ్యక్షుడు దస్తగిరి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.