వైభవంగా గిరి ప్రదక్షిణ
గజ్వేల్, మే 29 : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, నాచారం గుట్టలో శ్రీ స్వామివారి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వీయ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అశేష భక్త జనవాహిని పాల్గొని నారసింహ నామస్మరణలతో క్షేత్రం మారుమ్రోగింది.
ధర్మకర్తల చైర్మన్ పి. రవీందర్ గుప్తా, కార్య నిర్వాహణాధికారి బెల్లంకొండ రంగాచారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, ధర్మకర్తలు చందా నాగరాజు, గాలి కిష్టయ్య, కొత్తపల్లి శ్రీనివాస్, ఉషశ్రీ రాజశేఖర్ శర్మ, నాయకం శ్రీనివాస్, నాచారం సర్పంచ్ సారిక యాదగిరి, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం తూప్రాన్ ఆర్యవైశ్య సభ్యులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు ఉచిత అల్పాహారం అందించారు.






