అంగరంగ వైభవంగా సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం
ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేత
దోమకొండ, జూన్ 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ ఫోర్ట్ & గ్రామ అభివృద్ధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జూన్ 19 శుక్రవారం రోజున దివంగత కోట వారసులు ఉమాపతి జన్మదినాన్ని పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాస మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి దోమకొండ సర్పంచ్ నర్సయ్య , సీడీపీవో శ్రీమతి రోషిష్మ ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ నల్లపు అంజలి , సిద్ధారెడ్డి , గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి విద్యారంభం చేయించారు.
అనంతరం ట్రస్ట్ మేనేజర్ బాబ్జి మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులు, ప్రణవి-25,000/- సాయి తేజ-25,000/- భవాని-25,000/- అమూల్య-15,000/- భవిష్య-10,000/- లను ఘనంగా సన్మానించి వారికి స్కాలర్షిప్లు అందజేశారు. విద్యార్థుల కృషిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్య అనేది ప్రతి చిన్నారి జీవితానికి పునాది అని, అక్షరాభ్యాసం ద్వారా విద్యా ప్రయాణానికి శ్రీకారం చుట్టడం ఎంతో శుభప్రదమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి దోమకొండ ఫోర్ట్ & గ్రామ అభివృద్ధి ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గణేష్ యాదవ్, రాజశేఖర్ వినయ్, వెంకట లక్ష్మి, కల్పన , అంగన్వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు మరియు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






