16-02-2026 12:00:00 AM
భక్తులతో పోటెత్తిన క్షేత్రం
చిట్యాల, ఫిబ్రవరి15: మహాశివరాత్రి సందర్భంగా చెరువుగట్టు పుణ్యక్షేత్రంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులు శివనామ స్మరణతో ఆలయ ప్రాగాణం మారు మ్రోగింది. శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభనెలకొంది.
స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వ హించారు. అర్ధరాత్రి లింగార్చన కాలంలో నిర్వహించిన మహా అభిషేకం, రుద్ర పారాయణం, ప్రత్యేక అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. జిల్లా నలుమూలలతో పాటు, పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, దీక్షధారులు, రామలింగేశ్వరుడి దర్శనార్థం వచ్చిన కుటుంబాలు, యువత, మహిళలు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
కొందరు భక్తులు గుట్ట మెట్లపై నడుచుకుంటూ హర హర మహాదేవ నినాదాలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా, స్వచ్ఛంద సేవకులు భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శా ఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పా ట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. వైద్య శిబిరాలు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించారు. మహాశివరాత్రి సందర్భంగా క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో, భక్తుల తాకిడితో ద్వేద్వీపమానంగా వెలిగిపోయింది.