16-02-2026 12:00:00 AM
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ కు 4, బీఆర్‌ఎస్ ఒక చోట మెజార్టీ
సూర్యాపేట చైర్మన్ లాంఛనమే..
హుజూర్ నగర్, నేరేడుచర్లలో చైర్మన్ గిరికి ఇద్దరు చొప్పున పోటీ
కోదాడపై ఐదుగురు గురి
తిరుమలగిరి చైర్మన్ ఎవరో?
చైర్మన్‌ల ఎన్నిక నేడే..
సూర్యాపేట, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించగా 13న ఫలితాలను వెలువరించారు. అయితే సూర్యాపేట జిల్లాలో ఐదు మునిసిపాలిటీలు ఉండగా నాలుగు చోట్ల కాంగ్రెస్, ఒకచోట బీఆర్‌ఎస్ ఆదిత్య తన సాధించాయి. దీంతో సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, నేరేడుచర్లలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీని సాధించడంతో పాలకవర్గాలను ఏర్పాటు చేయనుండగా, తిరుమలగిరిలో బీఆర్‌ఎస్ కే అవకాశం దక్కింది.
అయితే ఇప్పటికే సూర్యాపేట చైర్మన్ గా మొరిశెట్టి నివేదిత లక్ష్యాది పేరును అధిష్టానం ఖరారు చేయగా వైస్ చైర్మన్ ఎవరన్న చర్చ సాగుతోంది. మిగతా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరనే విషయంలో ఉత్కంఠ నెలకొనగా నేడు జరిగే ఎన్నికతో దానికి తెరపడనుంది. అయితే ఫలితాలు వెలువడిన వెంటనే కౌన్సిలర్లను ఆయా పార్టీలు క్యాంపులకు తరలించాయి. క్యాంపు లోనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరన్నది చర్చించి నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తుంది. కాగా నేడు జరిగే చైర్మన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేయగా... కౌన్సిలర్లు ఎన్నికకు హాజరై చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకోనున్నారు.
సూర్యాపేటలో లాంఛనమే
సూర్యాపేట మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థిగా మొరిశెట్టి నివేదిత లక్ష్యాదిని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆమె చైర్మన్ గా ఎన్నిక లాంఛనమే కాగా వైస్ చైర్మన్ ఎవరన్నది తేలాల్సి ఉంది. వైస్ చైర్మన్ పదవి పై ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు దఫాలుగా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. వైస్ చైర్మన్ పదవి కోసం బీసీ సామాజిక వర్గానికి చెందిన గుణగంటి హేమాసతీష్, బైరు శైలేందర్, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, వెలుగు వెంకన్న లతో పాటు మైనార్టీ వర్గానికి చెందిన షేక్ జహీర్, షపీఉల్లా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.
కోదాడపై ఐదుగురు గురి
కోదాడ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఐదుగురు పోటీ పడుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. వీరిలో దేవరపల్లి మల్లేశ్వరి, ఎర్నేని కుసుమ కుమారి, పార సత్యవతి, గుండపనేని పద్మావతి, ఎస్ కె నేహా లు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో మల్లీశ్వరి కోసం మంత్రి, ఎమ్మెల్యేలకు అతి దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే పద్మావతి తరపున మాజీ ఎమ్మెల్యే పావులు కదుపుతుండగా, సత్యవతి బీసీ సామాజిక అంశంను తెరమీదకు తీసుకవచ్చినట్లు తెలిసింది. ఇక మైనారిటీ కోటాలోను నేహా ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఈ విషయంపై మంత్రి ఒక నిర్ణయానికి వచ్చినట్లు వినికిడి. ఇక్కడ వైస్ చైర్మన్ ఎంపిక సైతం తేలాల్సి ఉంది.
నేరేడుచర్లలో ఇద్దరు పోటీ..
నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ జనరల్ కావడంతో కొణతం చిన్న వెంకట్ రెడ్డి, నూకల సందీప్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. వీరిలో వెంకటరెడ్డి గతంలో కౌన్సిలర్ గా కొనసాగడంతో పాటు రాజకీయంగా అనుభవం ఉండడంతో ఆయనకే కొంత కలిసి వచ్చే అవకాశం ఉందంటూ చర్చ సాగుతుంది. ఈయన సతీమణి మంజుల సైతం 4 వవార్డు కౌన్సిలర్ గా గెలుపొందడం అదనపు బలం. ఇక సందీప్ రెడ్డి తల్లి గతంలో కౌన్సిలర్ గా కొనసాగడంతో ఆయనకు సైతం అవకాశాలు ఉన్నాయంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇక ఇక్కడ వైస్ చైర్మన్ ఎవరనేది చైర్మన్ ఎంపికపై ఆధారపడి ఉంటుంది
మంత్రి చేతిలోనే హుజూర్ నగర్ ఎంపిక
హుజూర్ నగర్ మున్సిపాలిటిలో 28 వార్డులు ఉండగా 19 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్న మంత్రి ఉత్తమ్ కి ఇక్కడ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలనేది కొంత సందిగ్ధంగా మారిందంటూ చర్చలు వినిపిస్తున్నాయి. గౌడ సామాజిక ప్రాబల్యం ఇక్కడ అధికంగా ఉండడంతో దొంతగాని శ్రీనివాస్ గౌడ్ కు ఇవ్వచ్చని పలువురు అభిప్రాయపడుతున్నప్పటికీ, ఈయన గతంలో చైర్మన్ గా పనిచేయడం కొంతమేర ఆలోచనలో పడేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు చైర్మన్ కావచ్చు అంటూ బలంగానే వినిపిస్తుంది. అయితే మంత్రి మాత్రం ఎక్కడ ఇబ్బందిగా కలకూడదనే ఉద్దేశ్యంతో చెరోసగం చొప్పున చైర్మన్ పదవిని అప్పగిస్తారంటూ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటు న్నట్టు తెలుస్తుంది. వైస్ చైర్మన్ పదవి కోసం కోతి సంపత్రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే ఈ విషయాలపై మంత్రి ఉత్తమ్ చాలా లోతుగా ఆలోచించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
తిరుమలగిరి చైర్మన్ ఎవరో..?
తిరుమలగిరి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ 10 వార్డులు గెలుసుకోగా, కాంగ్రెస్ 5 వార్డులు గెలుచుకుంది. అయితే బీఆర్‌ఎస్ పార్టీ ముందుగానే సంకెపల్లి రఘునందన్ రెడ్డి పేరును చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన్నే చైర్మన్గా ఎన్నుకునే అవకాశం ఉంది. కాగా అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇద్దరు కౌన్సిలర్లను తమ వైపుకు తిప్పుకొని చైర్మన్ గిరిని తమ ఖాతాలో వేసుకోవాలనే విశ్వ ప్రయత్నాలు చేస్తుందంటూ వార్తలు బయటకు వస్తున్నాయి.
ఇదే జరిగితే ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిసి కాంగ్రెస్ పీఠంపై కూర్చునే అవకాశాలు లేకపోలేదని స్థానికంగా పెద్ద చర్చే సాగుతుంది. అయితే క్యాంపులోనే ఉన్న బీఆర్‌ఎస్ కౌన్సెలర్లను మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ లు నేడు నేరుగా చైర్మన్ ఎన్నిక వద్దకు తీసుక వచ్చి అనుకున్న ప్రకారం తమ అభ్యర్థిని చైర్మన్ ను చేసేందుకు మార్గాలను సుగమం చేసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎక్కడ ఎవరు చైర్మన్ అవుతారనేది తేలాలంటే నేటి మధ్యాహ్నం వరకు వేచి చూడక తప్పదు.