16 July, 2026 | 2:14 AM

రీఫిల్లింగ్.. నో కేరింగ్..!

16-07-2026 02:04 AM
  1. యధేచ్చగా గ్యాస్ రీఫిల్లింగ్ దందా
  2. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు
  3. జనావాసాల మధ్య రీఫిల్ చేస్తున్న వైనం
  4. చోద్యం చూస్తున్న అధికారులు
  5. తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్న స్థానికులు 

దామరచర్ల, జూలై 15 :మండలంలో గ్యా స్ రీఫిల్లింగ్ దందా జోరుగా కొనసాగుతోంది. కొందరు వ్యాపారులు గ్యాస్ రీఫిల్లిం గ్ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దుకాణాలు, ఇండ్లల్లో సిలిండ్ల రీఫిల్లింగ్ చేస్తు న్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. నార్కెట్ పల్లి-అద్దంకి రహదారిపై గల దామరచర్లలో రహదారి కి ఇరువైపులా గల పలు దుకాణాల్లో చిన్న సిలిండర్లలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారు. రహదారి వెంట గల ఈ దుకాణాల్లో లారీ డ్రైవర్లు అధికంగా చిన్నసిలిండర్లు రీఫిల్లింగ్ చేయించుకుంటున్నారు.

కేజీకి రూ.250 నుంచి 300 వరకు వసూలు : ఒక కేజీ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తే రూ.250 నుండి రూ.300 వరకు తీసుకుంటున్నారు. చిన్నసిలిండర్లు రెండు, మూడు, ఐదు కిలోల్లో లభిస్తున్నాయి. ఒక్క దామరచర్లలోనే రోజుకు రూ. 100-200 సిలిండర్లను రీఫి ల్లింగ్ చేస్తున్నారు. వంటావార్పు చేసుకునే లారీ డ్రైవర్లు, బ్యాచ్లర్స్ అధికంగా చిన్న సిలిండర్లను వినియోగిస్తున్నారు. . గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ ను రీఫిల్లింగ్ చేస్తున్నారు. బ్లాక్ కు కావాల్సినన్ని పెద్ద సిలిండర్లు లభ్యమౌతుండటంతో రీ ఫిల్లింగ్ దందా జోరుగా కొనసాగుతోంది.

ప్రమాదాలు జరిగిన సందర్భాలెన్నో.. 

జనావాసాల మధ్య గ్యాస్ రీఫిల్లింగ్ దందా చేస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు గతంలో ఒకట్రెండు సార్లు రీ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో సిలిండర్లు పేలిన సంఘటనలున్నాయి. ఓ దుకాణంలో కూడా చిన్న సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు చెలరేగిన విషయం విధితమే. చిన్న సిలిండర్లలో గ్యాస్ రీఫిల్లింగ్ ఎంతో ప్రమాదకరమైనప్పటికీ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. జనావాసాల మధ్యే బహిరంగంగా రీఫిల్లింగ్ చేస్తుండడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోవని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

అధికారుల కనుసన్నల్లోనే..! 

గ్యాస్ రీఫిల్లింగ్ దందా అధికారుల కనుసన్నల్లో జరుగుతున్నట్టు అనుమానాలు వ్యక్తమౌతు న్నాయి. దుకాణాల ముందు బహి రంగంగా చిన్న సిలిండర్లు ప్రదర్శించడంతో పాటు, రీఫిల్లింగ్ చేస్తున్నారు. ఆయా వ్యాపారుల నుంచి కొందరు అధికారులు నెలసరి మామూళ్లు గుంజుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.. ఎవరైనా ఉన్నతాధికారులు వస్తున్నారంటే ముందు గానే -సమాచారాన్ని రీఫిల్లింగ్ వ్యాపారులకు చేర వేయడం జరుగుతుంది. దింతో వ్యాపారులు ఎక్కడికక్కడ సర్దుకోవడం జరుగుతోంది. ఎంతో ప్రమాదకరమైన ఈ దందాకు ఇకనైనా ముగింపు పలకాలని ప్రజలు కోరుతున్నారు.          

తగు చర్యలు తీసుకోవాలి 

తగు జాగ్రత్తలు పాటించకుండా గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం ఎంతో ప్రమాదకరం. అదీ జనావసాల మధ్య రీఫిల్లింగ్ చేస్తే ఏదైనా ఊహించని సంఘటనలు జరిగినప్పుడు వాటి ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కావున అధికారులు తగు చర్యలు తీసుకునీ ప్రమాదాలు సంభవించకుండా చూడాలి.

 జాజుల లింగం గౌడ్ ,బిసి సంఘ నాయకులు ,దామరచర్ల