ఎల్‌నినో ప్రభావంతో రైతన్నలు నష్టపోతున్నారు
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, జులై 15 (విజయక్రాంతి): ఎల్నినో ప్రభావంతో రైతన్నలు కొంత నష్టపోతున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. బుధవారం ఖమ్మం లో ఆయన మీడియాతో మాట్లాడారు. అనుకున్న సమయానికి వర్షాలు లేకపోవడం వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. దానికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు వెళ్తే బాగుటుందని సూచించారు. రేపటి నుంచి ఆగస్టు రెండో వారంలోగా ఆరుతడి పంటలపైన అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు.
ఆయా జిల్లాల వారీగా వివరాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఈ పంటల కోసం అన్నదాతలకు తమ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాన్ని ఇంకా నిర్ణయించలేదని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే తమ కర్తవ్యమని తెలిపారు. కంది, సొయా బీన్, పెసర, మినుము, జొన్న, సజ్జల సాగుకు రైతులు సిద్ధపడాలని సూచించారు. వర్షాల మీద ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.






