దేవరకొండలో ధాన్యం కొనుగోలు సమీక్షా సమావేశం
దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు, రైస్ మిల్లర్లు, రవాణా నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ చరిత్రలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండించారని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ధాన్యం సేకరణలో తాలు, చెత్త పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తూకం పారదర్శకంగా ఉండాలని, గోనె సంచుల లభ్యతను నిర్ధారించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లారీల కొరత ఉన్న చోట ఇతర వాహనాలను వినియోగించి ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమణారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు






