సరిహద్దుల్లో చెక్‌పోస్టులు.. పశువుల అక్రమ రవాణాపై కఠిన నిఘా
- సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి: డీఎస్పీ బి.అశోక్
వాంకిడి,(విజయక్రాంతి): పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్ తెలిపారు. శుక్రవారం వాంకిడి పోలీస్ స్టేషన్‌లో వాంకిడి సీఐ వేణుగోపాల్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆవులు, దూడలు తదితర పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అనుమానాస్పద రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. అలాంటి చర్యలు శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశముందని పేర్కొన్నారు.గంజాయి సాగు, రవాణాపై కూడా ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. శుభకార్యాల్లో డీజేలు వినియోగించాలంటే ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. రాత్రి 10 గంటల తర్వాత అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్‌లు వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.సమావేశంలో ఎస్సై మహేందర్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






