ముత్తారం పోలీసుల సమక్షంలో ఫోన్ అప్పగింత
తాటి చెందు నిజాయితీని అభినందించిన ఎస్ఐ
ముత్తారం,(విజయక్రాంతి): రోడ్డుపై దొరికిన మొబైల్ ఫోన్‌ను పోలీసులకు అప్పగించి మంథని మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన తాటి చెందు తన నిజాయితీని చాటుకున్నారు. ముత్తారం ఎస్ఐ రవికుమార్ కథనం ప్రకారం... బట్టుపల్లి గ్రామానికి చెందిన తాటి చెందు శుక్రవారం పని నిమిత్తం ముత్తారం వస్తుండగా మార్గమధ్యలో రోడ్డుపై ఒక మొబైల్ ఫోన్ పడి ఉండటాన్ని గమనించారు. ఆ ఫోన్‌ను వెంటనే తీసుకుని ముత్తారం పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ రవికుమార్ కు అప్పగించారు.
ఎస్ఐ వెంటనే సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్ యజమాని వివరాలు సేకరించగా, అది ముత్తారం కేశనపల్లి గ్రామానికి చెందిన మాకోటి సతీష్ దిగా తేలిందని, సదరు యజమానిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, ఎస్ఐ చేతుల మీదుగా ఫోన్‌ను అందజేశారు. దొరికిన వస్తువును పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచిన తాటి చెందును ఎస్ఐ రవికుమార్, పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. పోగొట్టుకున్న ఫోన్ తిరిగి దక్కడంతో సతీష్ పోలీసులకు మరియు తాటి చెందు కు కృతజ్ఞతలు తెలిపారు.






