ఆధారాలివ్వండి.. చర్యలు తీసుకుంటాం
- శాంతిఖని నోటీస్ బోర్డుపై ఏజెంట్ ప్రకటన
- విజయ క్రాంతి కథనాలకు స్పందన
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతిఖని ప్రాజెక్టులో చోటుచేసుకుంటున్న కొందరు అధికారుల తీరుపై విజయక్రాంతి లో ప్రచురితమైన కథనాలపై యాజమాన్యం కదలిక వచ్చింది. ముఖ్యంగా ఈ నెల 13న వచ్చిన 'అమ్యామ్యాలిస్తే అలకటి పనులు ' కథనం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..ఇదే క్రమంలో 'ఆ ముగ్గురికి ఆ మూడు సంఘాలు అండ అనే' కథనంపై జోరుగా చర్చ జరిగింది.
మొత్తంగా ఈ రెండు కథనాలు అధికారులు, కార్మిక సంఘాలల్లో కలవరంరేపింది. కార్మికుల్లో వాడివేడి గా చర్చనీయాంశం అయ్యింది. వరుసగా శాంతిఖనీపై, వచ్చిన కథనాలను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. శాంతిఖని ఏజెంట్ పేరిట గని నోటీస్ బోర్డు ప్రకటన తో కార్మికులకు పిలుపు నివ్వడమే అందుకు అద్దం పడుతుంది. ఇటీవల పత్రికలో సోషల్ మీడియా, మాధ్యమాల్లో గని కి సంబంధించి వార్తలు వస్తున్నాయి.
అలాంటివేవైనా సంఘటనల కు సంబంధించి ఆధారాలు ఉంటే మేనేజ్మెంట్ కు అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆ నోటీస్ బోర్డు పై అంటించిన ప్రకటనలో ఏజెంట్ కోరారు. ఈ నెల 14న గని నోటీస్ బోర్డుపై వెలిసిన ఈ ప్రకటన కార్మికులు, ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. మరో సారి కార్మికులు విజయ క్రాంతి కథనాలను గుర్తుకు తెచ్చుకోనీ చర్చించుకోవడం కనిపించింది. ఏదేమైనా శాంతిఖని అధికారుల తీరుపై వచ్చిన కథనాలపై ఏజెంటు స్పందించడాన్ని కార్మికులు, ఉద్యోగులు హర్షిస్తున్నారు.






