అంగన్వాడీల్లో గ్రాడ్యుయేషన్ డే సందడి
ప్రతి నెల వైద్య పరీక్షలు తప్పనిసరి : సర్పంచ్ ఎల్లారెడ్డి
సిద్దిపేట రూరల్,ఏప్రిల్ 22: నారాయణరావుపేట అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పోషకాహారం, ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచ్ సర్పంచ్ ఎల్లారెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీల్లో నిర్వహించే గ్రాడ్యుయేషన్ డే చిన్నారుల జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలుస్తుందని తెలిపారు. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీల్లో నమోదు చేయించాలని సూచించారు.
పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా సమతుల్య పోషకాహారం అందించడం అత్యంత అవసరమని అన్నారు. అంగన్వాడీ సిబ్బంది గర్భిణీ స్త్రీలకు సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన శిశువులు జన్మిస్తారని తెలిపారు.
ప్రతి నెలా వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బింగీ నవీన్,ఆరోగ్య సిబ్బంది, సిఆర్పీ జి. లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు మహిళలు పాల్గొన్నారు.






