10 April, 2026 | 6:00 PM

రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం

10-04-2026 03:59 PM

బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నీల అనిల్

ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేత 

కుభీర్,(విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం  రైతులు తమ పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిల అనిల్ ఆరోపించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ శివరాజ్ కు మొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ ఆవరణలో మాట్లాడుతూ.. మొక్కజొన్న పంట చేతికొచ్చి దాదాపు నెలరోజులు గడిచిపోతున్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి  మద్దతు ధరతో ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలిచి ఉండాల్సింది పోయి సోయి లేక నేటికీ కేంద్రాలు తెరవకపోవడం విడ్డూరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో మక్క రైతులు ప్రైవేట్ లో రూ. 1700 క్వింటాలు అమ్ముకొని ఎకరాకు రూ.25 వేల నుండి రూ.30 వేల  వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోయా, కందులు, శనగలు రైతుకు చేతికి వచ్చిన సమయంలోను ప్రభుత్వం ఇదే నాటకం ఆడిందని ఈ ప్రభుత్వానికి రైతులపై ఏ పార్టీ మమకారం ఉందో ఇట్లే అర్థమవుతుందని పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి 24 గంటలు వ్యవసాయ విద్యుత్, రైతుబంధు, రైతులకు వ్యవసాయ భీమా సౌకర్యం, రైతులకు సరిపడా ఎరువులను సరఫరా చేసిందని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి పాలన పై ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న  నాయకులు, కార్యకర్తలే బాహటంగా ఒప్పుకుంటున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా మండలంలో ఏడు మక్కా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఎలాంటి ఆంక్షలు విధించకుండా మద్దతు ధరతో మొక్కలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు,  గాలుల బీభత్సంతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు.