రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
మార్కెట్ కమిటీ చైర్మన్ యాణారెడ్డి
చివ్వెంల,(విజయక్రాంతి): రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ యాణారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గుంజలూరు, తిమ్మాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ (IKP) ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో యాణారెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను రైతులకు అందించడమే ఈ కేంద్రాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోకూడదని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, నీడ వంటి కనీస సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం తూకంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని సరిగా ఆరబెట్టి, తాలు లేకుండా శుభ్రం చేసుకుని కేంద్రాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుంజలూరు, తిమ్మాపురం గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, ఏపీఎం వెంకయ్య, ఐకేపీ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




