27 August, 2026 | 7:02 PM

అర్హులైన ప్రతి ఓటరుకు తుది జాబితాలో చోటు

27-08-2026 05:42 PM

అనర్హ, వాస్తవంగా లేని ఓట్ల తొలగింపే ప్రత్యేక ఓటరు సవరణ లక్ష్యం

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ

గణపురం,(విజయ క్రాంతి): అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పిస్తూ, అనర్హమైన, వాస్తవంగా లేని ఓట్లను తొలగించి పారదర్శకమైన తుది ఓటర్ల జాబితా రూపొందించడమే ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం గణపురం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు కలెక్టర్ హాజరై ఓటరు సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో గుర్తించిన నో మ్యాపింగ్, అనామలీస్ సమస్యలు, నోటీసుల జారీ, విచారణ ప్రక్రియను వివరించారు.

రెండు నెలలుగా జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి, 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేసినట్లు తెలిపారు. మ్యాపింగ్ కాని ఓటర్లను నో మ్యాపింగ్‌గా, పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు తదితర వివరాల్లో వ్యత్యాసాలను అనామలీస్‌గా గుర్తించినట్లు చెప్పారు. ఈ కేటగిరీల్లో ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని, నిర్ణీత తేదీలో విచారణకు హాజరై అవసరమైన ఆధారాలు సమర్పించాలని సూచించారు. నిజమైన ఓటర్ల పేర్లు తుది జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, నోటీసులు అందుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

గణపురం మండలంలో 3,371 ఓట్లు తొలగింపు

గణపురం మండలంలో ప్రత్యేక సవరణకు ముందు 33,493 మంది ఓటర్లు ఉండగా, 3,371 ఓట్లు తొలగించడంతో ప్రస్తుతం 30,122 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. మండలంలో 36 పోలింగ్ కేంద్రాలు ఉండగా, కొత్త గ్రామపంచాయతీలను దృష్టిలో ఉంచుకుని మరో మూడు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ముసాయిదా జాబితాకు ముందు గుర్తించిన 6,338 అనామలీస్ కేసుల్లో 4,395 పరిష్కరించామని, ప్రస్తుతం 1,945 అనామలీస్, 1,551 నో మ్యాపింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు.

జిల్లాలో సుమారు 35 వేల అనామలీస్, నో మ్యాపింగ్ కేసులు ఉన్నాయని, నోటీసులు, విచారణ ప్రక్రియను వేగవంతం చేస్తామని వెల్లడించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేసి ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ విజయవంతానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావు, గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.