4 March, 2026 | 3:45 AM

సర్కారు వివక్ష?

04-03-2026 12:00 AM

వారంతా ప్రభుత్వ ఉద్యోగులే.. అయినా వర్తించని ‘ఈహెచ్‌ఎస్’

ట్రెజరరీ ద్వారా జీతాలు అందడంలేదనే సాకుతో70 వేల మందిని పథకంలో చేర్చని ప్రభుత్వం

ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా తమపై వివక్ష వద్దని ఆవేదన

వారిలాగే మాకూ హెల్త్ కార్డులివ్వాలని డిమాండ్

హైదరాబాద్, మార్చి 3(విజయక్రాంతి): వారంతా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులే.. అయినా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు అందే ప్రభుత్వ ప్రయోజనాలకు వీరు దూరమవుతున్నారు. వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు.. ఇతర ఉద్యోగుల మాదిరిగా నిబంధనలూ వర్తించడంలేదు. తమపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరిలాగే ప్రభుత్వం జారీ చేసే ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా నియామక పరీక్షలు రాసి, మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు.

కానీ ఏవో సాంకేతిక కారణాలను సాకుగా చూపి నూతన ఈ హెచ్‌ఎస్ స్కీంకు వీరిని దూరం చేస్తున్నారనే విమర్శలున్నాయి. వివిధ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 70 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఈహెచ్‌ఎస్ స్కీంను అమలు చేయడంలేదు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తమను ద్వితీయ శ్రేణి ఉద్యోగులు గా ప్రభుత్వం చూస్తోందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వ్యత్యాసమెందుకు?

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు న్యూహెల్త్ స్కీంను ప్రారంభించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లక్షా 44 వేల మంది ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు వారి డిపెండెంట్లు 12.84 లక్షల మంది ఉన్నారని అధికారులు తొలుత గుర్తించారు. అయితే ఈ పథకం కోసం ప్రతి నెలా ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఉద్యోగుల వాటా ఏటా రూ.528 కోట్లు కాగా, ప్రభుత్వం కూడా తన వాటా కింద రూ.528 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

వీటిని ఈహెచ్‌ఎస్ ట్రస్టులో జమ చేసి అవసరమైన వైద్య ఖర్చు కోసం ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారు. అయితే తాము అందరిలాగే ప్రభుత్వ ఉద్యోగులమే అయినప్పుడు తమను కూడా వీరితోనే కలిపి ఈహెచ్‌ఎస్‌లో ఎందుకు కలపడంలేదని బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయు లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యత్యాసం చూపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులుగా సమాన హక్కులు పొందాల్సిన తమకు వివక్షకు గురిచేయడం సరికాదని అంటున్నారు.

సెకండ్ ఫేజ్‌లో ఇచ్చే అవకాశం!

ప్రభుత్వం తొలుత గుర్తించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఈ పథకాన్ని అమలు చే యాలనుకుంటుంది. తర్వాత మిగిలిన వారి కి వర్తింపజేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలోనే గ్రాంట్ ఇన్ ఎయిడ్, సొసైటీల్లో పనిచేస్తున్న వారికి సెకండ్ ఫేజ్ లో హెల్త్ కార్డులు జారీ చేసే అవకాశముం ది. సెకండ్ ఫేజ్‌లో కాకుండా మొదటి విడతలోనే కార్డులు జారీ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. 

గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద పనిచేస్తున్నారని...

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల పద్ధతుల్లో తీవ్ర వ్యత్యాసం ఉంటోంది. రెగ్యులర్ ఉద్యోగులకు ఒకలా ఇస్తే..సొసైటీ కింద పనిచేసే ఉద్యోగులకు మరోలా నెలవారి చెల్లింపులుంటున్నాయి. కొన్ని విభాగాల్లోని ఉపాధ్యాయులు, ఉద్యోగులకు 010 పద్దు ద్వారా నేరుగా ట్రెజరీ ద్వారా వారి ఖాతాల్లో ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు జమవుతాయి. కానీ సొసైటీల్లో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వేతనాలు పొందుతున్నారు.

ఇలా పొందుతున్న వారిలో మోడల్ స్కూల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, గ్రంథాలయ ఉద్యోగులు, ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇంకా మిగతా విభాగాల్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులు కలిపి దాదాపు 70 వేల మంది వరకు ఉంటారు. అయితే వీరందరికీ రెగ్యులర్ ఉద్యోగుల్లాగా ట్రెజరీ ద్వారా ఒకటో తారీఖున వేతనాలు జమకావు. ఫస్ట్ తర్వాత ఎప్పుడైనా జమవుతాయి.

అంతేకాకుండా ఆరు నెలలకో లేదా సంవత్సరానికో ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అందులోంచి జీతాలు విడుదల చేస్తారు. అంటే ఎప్పటికప్పుడు బడ్జెట్ కేటాయించుకోవాల్సి ఉంటుంది. కానీ రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రం ఇవేం ఉండవు. నేరుగా ట్రెజరీ నుంచి జమవుతాయి. ఇప్పుడిదే వీరికి శాపంగా మారింది. సొసైటీ కింద పనిచేస్తూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా జీతాలు పొందుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు నగదు రహిత హెల్త్ కార్డులను అందరు ఉద్యోగులతో సమానంగా జారీ చేయడంలేదు.

ఉద్యోగులందరికీ సమాన న్యాయం చేయాలి

మోడల్ స్కూల్, గురుకులాల్లో మెరుగైన ఫలితాలను సాధి స్తున్నా మాపై వివక్ష చూపడం సరికాదు. ప్రభుత్వ ఉద్యోగం ఉందని గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ కా ర్డులు, రేషన్ కార్డులను రద్దు చేశారు. మాకు ప్రభుత్వం ఇవ్వాల్సిన హెల్త్ కార్డులివ్వకుండా వివక్ష చూపుతోంది. ఉద్యోగులందరికీ ప్రభుత్వం సమాన న్యాయం చేయాలి. గ్రాంట్ ఇన్ ఎయి డ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మిగతా ఉద్యోగులతో సమానం గా హెల్త్ కార్డులు జారీ చే యాలి. అ లాగే కేజీబీవీల్లో పనిచేసే వారికి హెల్త్ స్కీంను అమలు చేయాలి.

 భూతం యాకమల్లు, 

టీఎంఎస్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు