9 May, 2026 | 12:10 PM

గంగకత్వ కాలువ ఆధునీకరణకు ప్రభుత్వం సమ్మతి

09-05-2026 12:00 AM
  1. జగ్గారెడ్డి కోరిక మేరకు రూ.42 కోట్ల విడుదలకు ప్రభుత్వం అంగీకారం
  2.   3 వేల ఎకరాలకు గంగకత్వ ద్వారా సాగునీరు
  3. దశాబ్దాలుగా ఆధునీకరణకు నోచుకోని నిజాం కాలం నాటి  కాలువ
  4. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమైన జగ్గారెడ్డి
  5. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన

సంగారెడ్డి, మే 8 (విజయక్రాంతి): కృషి ఉంటే ఎదైనా సాధించవచ్చని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మరోసారి నిరూపించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామం నుండి మొదలయ్యే నిజాం కాలం నాటి  గంగకత్వ కాలువ ఆధునీకరణకు జగ్గారెడ్డి చొరవతో ఎట్టకేలకు మోక్షం లభించింది. నిజాం కాలంలో నిర్మించిన ఈ కాలువ ఇప్పటివరకు మరమ్మత్తుకు నోచుకోలేదు.

దశాబ్దాల పాటు మరమ్మత్తుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా పనులకు మోక్షం కలుగలేదు. గంగకత్వ ఆయకట్టు రైతులు, స్థానిక నేతల కోరిక మేరకు జగ్గారెడ్డి  రెండు నెలల క్రితం నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆధునీకరణ పనుల కోసం వెంటనే కొత్త ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

కాలువ ఆధునీకరణ పనులకోసం నీటి పారుదల శాఖ అధికారులు రూ.42 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఆ ప్రతిపాదనలకు ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో సెక్రటేరియట్ లో జగ్గారెడ్డి సమావేశం అయ్యారు. గంగకత్వ కాలువకు చేపట్టబోయే ఆధునీకరణ పనులపై ఈ సమావేశంలో చర్చించారు. 

ఆధునీకరణ పనులు ఇలా...

గంగకత్వ కాలువ సదాశివపేట మండలం సూరారం గ్రామంలో ప్రారంభమై 11 గ్రామాలను కలుపుతూ సదాశివపేట మండలంలోని మాచిరెడ్డిపల్లి గ్రామం వరకు సుమారు 15 కిలో మీటర్ల పొడవునా విస్తరించి ఉంది. గంగకత్వ కాలువకు 33 చెరువుల నుండి  ఫీడర్ చానల్స్ ఉన్నాయి. ఆధునీకరణ పనుల్లో భాగంగా కాలువకు లైనింగ్ పనులు చేపడతారు. కాలువపైన అవసరం ఉన్న చోట కొత్త బ్రిడ్జిల నిర్మాణం, పాత వాటికి మరమ్మత్తు పనులు చేస్తారు. దీనితో పాటు కాలువ పొడవునా తూములకు రిపేర్లు చేస్తారు. ఈ కాలువ పనులు పూర్తయితే 3000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు.

సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన..

సీఎం రేవంత్ రెడ్డి త్వరలో సంగారెడ్డికి రానున్న నేపథ్యంలో గంగకత్వ పనులకు సైతం సీఎంతో శంకుస్థాపన చేయించేందుకు జగ్గారెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు త్వరితగతిన ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి చేతుల మీదుగా గంగకత్వ పనులకు శంకుస్థాపన జరుగుతుందని జగ్గారెడ్డి అధికారులకు వివరించారు.