5 June, 2026 | 12:37 PM

చిన్నారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

05-06-2026 01:44 AM

కొత్తగా 76 ప్రీ ప్రైమరీ స్కూళ్లు 

మహబూబాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ఇప్పటివరకు ప్రైవేట్ కు పరిమితమైన కాన్వెంట్ విద్యను ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా ఈ విద్యా సంవత్సరం నుంచి మహబూబాబాద్ జిల్లాలో విద్యాశాఖ 76 ప్రీ ప్రైమరీ స్కూళ్లు ప్రారంభించడానికి నిర్ణయించింది. ఇందులో మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయసు గల చిన్నారులకు ఆంగ్ల మాధ్యమంలో పిల్లల వయసును బట్టి నర్సరీ, ఎల్.కే.జీ, యూ.కే.జీ లో విద్యాబోధన చేస్తారు.

ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి, పేద పిల్లలకు కాన్వెంట్ చదువులను అందుబాటులోకి తేవడానికి ప్రీ ప్రైమరీ విద్యా బోధన కొంత ఉతంగా మారే అవకాశాలు ఉన్నట్లు విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసులు చేయడంతో ప్రభుత్వం ఫ్రీ ప్రైమరీ నుంచే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెబుతున్నారు. ప్రత్యేకంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లు ప్రారంభించే గ్రామాల్లో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.

ఇంటింటికి తిరుగుతూ మూడేళ్ల వయసు పైబడ్డ పిల్లల వివరాలను సేకరించి, ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్య చెబుతామంటూ, అందులో చేర్చాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. ఇప్పటివరకు అంగన్వాడీలో ఆటపాటలతో అక్షర జ్ఞానం కలిగించిన పిల్లలకు కొత్తగా ఏర్పాటు చేసే ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. 

మహబూబాబాద్ జిల్లాలో ప్రీ ప్రైమరీ స్కూలు ఏర్పాటు చేసే మండలాలు ఇవే.?

ఈ విద్యా సంవత్సరం నుంచి మహబూబాబాద్ జిల్లాలో మూడు నుంచి ఐదేళ్ల పిల్లలకు ప్రత్యేకంగా విద్య నేర్పే ప్రీ ప్రైమరీ స్కూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. బయ్యారం మండలంలో 6, చిన్న గూడూరు 1, దంతాలపల్లి 4, డోర్నకల్ 8, గార్ల 2, గూడూరు 5, కేసముద్రం 3, కొత్తగూడా 1, కురవి 7, మహబూబాబాద్ 5, మరిపెడ 6, నరసింహుల పేట 5, నెల్లికుదురు 2, పెద్ద వంగర 6, సిరోల్ 3, తొర్రూర్ మండలంలో 11 గ్రామాల్లో ప్రీ ప్రైమరీ స్కూలు ఈ విద్యా సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేయనున్నారు.

అడ్మిషన్ల కోసం పంతుళ్ల ప్రచారం

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో అడ్మిషన్ల కోసం పంతుళ్లు ఇంటింటి ప్రచారం చేపట్టారు. తమ విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అందించే సౌకర్యాలను వివరిస్తూ, గత విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణతను తెలుపుతూ, ఒక్క పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య బోధనతో పాటు మధ్యాహ్న భోజనం, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తామంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకుల విద్యా బోధన నిర్వహిస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే చక్కటి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించడానికి కృషి చేస్తున్నారు.