8 August, 2026 | 10:18 PM

ఉన్నత విద్యతో బంగారు భవిష్యత్తు

08-08-2026 07:55 PM

- విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి

- డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

మొయినాబాద్,(విజయక్రాంతి): ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని జనగామ ఎమ్మెల్యే, వీజేఐటీ చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ చౌరస్తాలోని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ విద్యార్థుల కోసం శనివారం ఓరియంటేషన్ డే నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నాలుగేళ్లపాటు క్రమశిక్షణతో చదువుతూ ప్రాక్టికల్‌ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కళాశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ అధ్యాపకులు సూచించే అంశాలను నేర్చుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నాణ్యమైన విద్య అందించేందుకు కళాశాలలో మంచి ఫ్యాకల్టీ, అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కార్యక్రమంలో టీసీఎస్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోచ్ డాక్టర్ ప్రసాద్ చిట్టిమల్ల, ట్రీలాజీ ఇన్నోవేషన్ సీనియర్ హెచ్‌ఆర్ స్పెషలిస్ట్ అర్చన తదితరులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.