తెలంగాణ స్విమ్మర్ శ్రీనిత్యకు స్వర్ణం
సుహాస్ ప్రీతమ్ కు కాంస్యం
జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్ షిప్
భువనేశ్వర్, ఆగస్టు 23: జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ యువ స్విమ్మర్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే పలు విభాగాల్లో మెడల్స్ గెలిచిన తెలంగాణ స్విమ్మర్లు ఆదివారం కూడా మెరిశారు. తాజాగా మహిళల 200 మీ. బ్యాక్ స్ట్రోక్ లో తెలంగాణకు చెందిన శ్రీ నిత్య సాగి బంగారు పతకం కైవసం చేసుకుంది.ఆ మె ఈ రేసును 2 నిమిషాల 24.59 సెకన్లలో పూర్తి చేసి అగ్ర స్థానంలో నిలిచింది. శ్రీ నిత్య ఇప్పటికే 400 మీ. మెడ్లేలో సిల్వర్ మెడల్ గెలిచింది.ఇదే విభాగంలో కర్ణాటక స్విమ్మర్లు ప్రియాంశు మిశ్రా, మీనాక్షి రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
మరోవైపు పురుషుల 200 మీ. బ్యాక్ స్ట్రోక్ లో తెలంగాణకు చెందిన సుహాస్ ప్రీతమ్ మైలారి కాంస్యం సాధించాడు. ఈ రేసును సుహాస్ 2 నిమిషాల 6.62 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. కర్ణాటక స్విమ్మర్ వేదాంత వెంకట మధిర 2 నిమిషాల 6.13 సెకన్లలో రేసు పూర్తి చేసి స్వర్ణం గెలుచుకున్నాడు. అలాగే మంగం తీర్థు సిల్వర్ మెడల్ సాధించాడు. కాగా సుహాస్ ప్రీతమ్ ఇప్పటికే 50 మీ. బ్యాక్ స్ట్రోక్, 100 మీ. బ్యాక్ స్ట్రోక్ విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచాడు.






