24 August, 2026 | 3:43 AM

ఈస్ట్ బెంగాల్ దే డ్యూరాండ్ కప్

24-08-2026 12:08 AM

17వ సారి టైటిల్ కైవసం

ఫైనల్లో మోహన్ బగన్‌పై విజయం

కోల్‌కతా, ఆగస్టు 23: ప్రతిష్టాత్మక ఫుట్ బాల్ టోర్నీ డ్యూరాండ్ కప్2026 టైటిల్ ను ఈస్ట్ బెంగాల్ కైవసం చేసుకుంది. కోల్కతాలోని వివేకానంద యుబా భారతి క్రీడాంగణంలో జరిగిన 135వ డ్యూరాండ్ కప్ ఫైనల్ పోరులో మోహన్ బగన్ జట్టును 4-1 తేడాతో ఓడించి ఈస్ట్ బెంగాల్ ఈ చారిత్రక విజయాన్ని సాధించింది. ఫైనల్ మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ తరఫున బిపిన్ సింగ్ (10వ నిమిషం) తొలి గోల్ చేయ గా, ఎడ్మండ్ లాల్రిండిక హ్యాట్రిక్ గోల్స్ చేసి ఈస్ట్ బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 12, 23, 44 నిమిషాల్లో గోల్ చేశాడు.

మోహన్ బగన్ తరఫున మన్వీర్ సింగ్ (33వ నిమిషం) ఒక గోల్ చేశాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఈస్ట్ బెంగాల్ 4-1తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో ఈస్ట్ బెంగాల్ సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్ను కైవసం చేసుకుంది. ఈస్ట్ బెంగాల్ జట్టు డ్యూరాండ్ కప్ టైటిల్ను గెలవడం 22 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. ఈస్ట్ బెంగాల్ జట్టు డ్యూరాండ్ కప్ గెలవడం ఇది 17వ సారి. అత్యధిక సార్లు (17 సార్లు) ఈ కప్ గెలిచిన మోహన్ బగన్ సరసన ఈస్ట్ బెంగాల్ సంయుక్తంగా నిలిచింది. అంతకుముందు జరిగిన 2025 ఎడిషన్లో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి విజేతగా నిలిచింది.