15 June, 2026 | 2:28 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి

01-04-2026 12:39 AM

అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి దిశానిర్దేశం 

కందకుర్తి పుష్కరఘాట్ సందర్శన 

నిజామాబాద్, మార్చి 31(విజయక్రాంతి): వచ్చే ఏడాది జూలైలో అట్టహాసంగా జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పక్షం రోజుల క్రితం కూడా ఈ పుష్కర ఘాట్ ను సందర్శించిన సమయంలో అధికారులకు పురమాయించిన పనులను వారు ఏమేరకు చేపట్టారు అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.

పుష్కర ఘాట్ కు వచ్చే మార్గాలలో రహదారుల మరమ్మతులు, విస్తరణ పనులను, శివాలయం వద్ద కొనసాగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టాలని అన్నారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయాలలోనూ భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్ధం పరిసరాల పరిశుభ్రతతో పాటు భక్తులకు కనీస వసతులు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు.

గోదావరి పుష్కరాలకు త్రివేణి సంగమ ప్రాంతం అయినందున ఈ ఘాట్ వద్ద పుణ్య స్నానాల కోసం ప్రముఖులతో పాటు, లక్షలాదిగా భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాకపోకలకు ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు ఆయా మార్గాలలో అవసరమైన చోట కల్వర్టుల నిర్మాణాలు సైతం చేపట్టాలన్నారు. వి.వి.ఐ.పీల కోసం హెలిప్యాడ్ ను నిర్మించాలని, వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు వంటి వాటిని నాణ్యతతో చేపట్టి నిర్ణీత గడువు లోపు పూర్తి చేసేలా చూడాలన్నారు.

ఘాట్ వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ కందకుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెంజల్ మండల అధికారులతో సమావేశం అయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, జనాభా గణన ప్రక్రియల నిర్వహణపై కీలక సూచనలు చేశారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, దేవాదాయ శాఖ అధికారులు కమల, విజయరామారావు, తహసిల్దార్ శ్రవణ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.