అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త!
- సోషల్ మీడియాలో ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ ఆఫర్?
- మోసగాళ్ల కొత్త సైబర్ ట్రాప్!
- అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనార్
రంగారెడ్డి, ఆగస్టు 8 (విజయక్రాంతి): నగరంలో ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని ఆకర్షణీయమైన వల విసురుతున్నారు సైబర్ కేటుగాళ్లు. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా ఉన్న భాగ్యనగరంలో ఇటీవల ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ పేరుతో ఓ కొత్త రకం సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ‘ఒంటరిగా ఉన్నారా? సినిమాకి, కాఫీ డేట్కి వెళ్లడానికి తోడు కావాలా?‘ అంటూ సామాజిక మాధ్యమాల్లో రంగురంగుల ప్రకటనలతో అమ్మాయిలకు వల వేస్తున్నారు.
ఈ మాయాజాలం వెనుక ఉన్న అసలు డేటింగ్ ట్రాప్‌ను పసిగట్టిన హైదరాబాద్ పోలీసులు, సీపీ సజ్జనార్ మహిళలు, యువతను తీవ్రంగా హెచ్చరించారు. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వేదికగా ‘ఫస్ట్ ఆగస్టు స్పెషల్ -50% ఆఫ్’ అంటూ ఆకట్టుకునే పోస్టర్లతో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇంటర్నెట్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సృష్టించిన అందమైన అబ్బాయిల ఫొటోలను ప్రొఫైల్ పిక్స్‌గా పెట్టి బురిడీ కొట్టిస్తున్నారు.
ప్రత్యేక రేట్లతో ప్రకటనలు
కాఫీ మీటింగ్-రూ.499 (గంటకు), సినిమా డేట్-రూ.1,249, షాపింగ్‌కు తోడుగా రూ.1,499, పెళ్లిళ్లు/ఈవెంట్లకు-రూ.1,999, ఫుల్ డే ప్యాకేజీ (10 గంటలు)-రూ.4,499 గా ప్రకటలను చేస్తున్నారు. గోప్యత పాటిస్తామని, ఎటువంటి అక్రమ వ్యాపారం కాదని నమ్మబలుకుతూ ‘డైరెక్ట్ మెసేజ్ (డీఎమ్)‘ చేయమంటారు. మెసేజ్ చేయగానే కమ్మని మాటలతో ట్రాప్‌లోకి గుంజి.. అడ్వాన్స్ పేమెంట్, సెక్యూరిటీ డిపాజిట్ పేరిట డిజిటల్ వ్యాలెట్లు, క్యూర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేస్తారు. డబ్బులు పడగానే ఖాతాలను బ్లాక్ చేయడం లేదా వ్యక్తిగత సమాచారంతో బ్లాక్మెయిలింగ్‌కు దిగడం చేస్తున్నారు.
సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరిక!
సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఆకర్షణీయమైన పోస్టులను చూసి మోసపోవద్దని సీపీ సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. ఇది మహిళలు, యువతులే లక్ష్యంగా కేటుగాళ్లు పన్నిన నయా డేటింగ్ ట్రాప్ అని హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ పరిచయాలతో జాగ్రత్త.. ఉండాలని సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులు, విచిత్రమైన సేవలు అందించే ఖాతాలను అస్సలు నమ్మవద్దు అని సూచిస్తున్నారు. ఆన్లైన్లో కంటికి కనిపించని సేవల కోసం రూపాయి కూడా అడ్వాన్స్ చెల్లించవద్దన్నారు.
ఫొటోలు, ఫోన్ నంబర్లు, బ్యాంకింగ్ వివరాలు, లొకేషన్ వివరాలను అపరిచితులకు పంపడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారో పిల్లలపై తల్లిదండ్రులు నిరంతరం కన్ను వేసి ఉంచాలని చెప్పారు. ఆన్లైన్ మోసాల బారిన పడితే, లేదా అనుమానాస్పద పోస్టులు కనిపించినా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌ెే1930, వ్బుసైట్ cybercrime.gov.inలో గాని, ధా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లోగానీ ఫిర్యాదు చేయవచ్చు.






