23 July, 2026 | 1:06 AM

నాచారం గుట్టలో వైభవంగా గిరి ప్రదక్షిణ

23-07-2026 12:07 AM

మహా పూర్ణాహుతితో ముగిసిన వరుణ మహాయాగం

 గజ్వేల్, జూలై 22: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచారం గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో పాల్గొన్న  భక్తుల  ‘ఓం నారసింహాయ నమః‘ నామస్మరణలతో క్షేత్రం మారుమోగింది.

దేవస్థాన కార్యనిర్వాహణాధికారి బెల్లంకొండ రంగాచారి, మాజీ ధర్మకర్తల చైర్మన్ రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, మాజీ ధర్మకర్తలు చందా నాగరాజు, గాలి కిష్టయ్య, కొత్తపల్లి శ్రీనివాస్, ఉషశ్రీ రాజశేఖర్ శర్మ, శేఖర్ గుప్తా, నాచారం సర్పంచ్ సారిక యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ రెడ్డి, దేవస్థాన సిబ్బంది, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గిరి ప్రదక్షిణ అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అల్పాహారం ఏర్పాటు చేశారు. అనంతరం దేశంలో, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని సంకల్పించి మూడు రోజుల పాటు నిర్వహించిన వరుణ మహాయాగం మహా పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది.

వేదపండితులు వేదోక్తంగా ఋష్యశృంగుని నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించి యాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించిన ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందారు.