23 July, 2026 | 1:52 AM

ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలి

23-07-2026 01:04 AM

జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

జగిత్యాల రూరల్ ,జూలై 22 (విజయ క్రాంతి): ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి  సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం జగిత్యాల జిల్లా రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బి  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుల్లపేట గ్రామంలో గ్రామపంచాయతీ భవనం నిర్మాణ పనులను, ప్రాథమిక పాఠశాలకు నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల పనులను తనిఖీ చేశారు. అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న పల్లె దవాఖాన నూతన భవనం,  వీవో  భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న ప్రతి ప్రభుత్వ భవనం దీర్ఘకాలం ఉపయోగపడేలా నిర్మించాలని, పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, తహసీల్దార్ షాదాబ్ హకీం, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు,  తదితరులు పాల్గొన్నారు.