జెన్ జెడ్ మాస్టర్ ప్లాన్
- విజయ్ గెలుపు వెనుక వార్ రూం స్ట్రాటజీ
- ఐప్యాక్ మాజీ వ్యూహకర్త కపిల్ సాహు నేతృత్వం
- 40 మంది జెన్ జెడ్ యువతతో స్ట్రాటజీ టీమ్
- ద్రవిడ గడ్డపై పూర్తిగా కొత్త, భిన్నమైన పాలి‘ట్రిక్స్’
- ‘లెస్ విజయ్.. మోర్ క్రేజీ’ కాన్సెప్ట్ అస్త్రం
- విజయ్ సభల కంటే వైరల్ నెరేటివ్స్.. సోషల్ మీడియా వైబ్,
- యువతలో హైప్‌పై ఫోకస్
- చేరికలు.. సీట్ల కేటాయింపు.. అంతా వ్యూహాత్మకమే
- అవే తమిళ రాజకీయాల్లో మార్పునకు కారణం
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): చెన్నై నగరంలోని రద్దీ వీధుల మధ్య, సినిమా సెట్ల హడావిడి, రాజకీయ సభల కాంతి వెలుగులకు దూరంగా ఉన్న ఒక సాధారణ కార్యాలయం 2025 మొత్తం చాలా నిశ్శబ్దంగా, ఎంతో ఉత్కంఠభరితంగా పనిచేసింది.
పసుపు, మెరూన్ రంగుల కలయికతో కూడిన వర్క్ స్టేషన్లు, స్క్రీన్ల ముందు కూర్చుని డేటా విశ్లేషణలు చేస్తున్న యువత, గోడలపై నిలిచిన నటుడు, -రాజకీయ నాయకుడు సీ జోసఫ్ విజయ్ భారీ కటౌట్లు... ఇదే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ విజయానికి వ్యూహాలు రచించిన వాయిస్ ఆఫ్ కామన్స్(వీవోసీ) వార్‌రూమ్. 2026 మే 4న అప్పటికీ కేవలం రెండేళ్ల క్రితం ప్రారంభమైన టీవీకే పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు 108 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది.
ఎన్నో దశాబ్దాలుగా తమిళనాడులో కొనసాగుతున్న డీఎంకే, అన్నా డీఎంకే పార్టీ ద్వైపాక్షిక ఆధిపత్యానికి ఇది భారీ దెబ్బగా నిలిచింది. నటుడు విజయ్ మిత్రపక్షాల మద్దతుతో సీఎం పీఠానికి అధిరోహించారు. అయితే ఈ విజయానికి కారణం కేవలం స్టార్ ఇమేజ్ మాత్రమే కాదు.. ఐప్యాక్ మాజీ వ్యూహకర్త కపిల్ సాహు ఆధ్వర్యంలోని 40 మంది జెన్ జెడ్ యువతతో కూడిన స్ట్రాటజీ టీం కీలకంగా వ్యవహరించింది. ముప్పు ఏళ్ల వయ స్సులోనే రాజకీయ వ్యూహాల్లో దశాబ్ద అనుభవం సంపాదించిన కపిల్ సాహు, కాంగ్రెస్, ఆప్, సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ వంటి పార్టీల ఎన్నికల వ్యూహాల్లో పనిచేశారు.
ప్రశాంత్ కిశోర్ సంస్థ నుంచి బయటకు వచ్చిన తరువాత తన సహచరులతో కలిసి సొంత సంస్థను ప్రారంభించారు. 2024లో విజయ్ టీవీకేని ప్రారంభించినప్పుడు పార్టీకి బూత్ స్థాయి క్యాడర్ లేకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేకపోవడం పెద్ద సవాలుగా మారింది. అలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో పూర్తిగా కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించాల్సిన బాధ్యత సాహు బృందంపై పడింది.
‘లెస్ విజయ్.. మోర్ క్రేజీ’ కాన్సెప్ట్
కపిల్ సాహు స్ట్రాటజీ టీం ‘లెస్ విజయ్.. మోర్ క్రేజీ’ అనే క్యాన్సెప్ట్‌తో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. విజయ్ సభల కంటే వైరల్ నెరేటివ్స్, సోషల్ మీడియా క్రేజ్, యువతలో హైప్ సృష్టించడం మీదే దృష్టి పెట్టింది. భారీ ర్యాలీలకు బదులుగా డిజిటల్ క్యాంపెయిన్, నియోజకవర్గ స్థాయి మైక్రో అనాలసిస్, యువ ఓటర్ల ఆలోచనల సరళిపై ఎక్కువగా ఫోకస్ చేసింది.
2025 సెప్టెంబర్‌లో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మరణించడం టీవీకేకి పెద్ద దెబ్బగా మారే పరిస్థితిలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది. అదే ఘటనను వార్ రూమ్ వ్యూహకర్తలు సానుభూతి వాతావరణంగా మలిచారు. విజయ్ పబ్లిక్ ఈవెంట్లను తగ్గించి, బాధిత కుటుంబాలతో నేరుగా సంప్రదింపులు జరిపించారు. ప్రత్యర్థులు విమర్శలు చేయడానికి ప్రయత్నిం చినా, ప్రజల్లో మాత్రం ఘటనపై విజయ్ బాధ్యత తీసుకున్నాడు అనే భావన పెరిగింది.
అయితే 2025 జూన్ నుంచే అసలు వ్యూహాత్మక అడుగులు ప్రారంభించారు. 234 నియోజకవర్గాల్లో ఫీల్డ్ రీసెర్చర్లు తిరిగి ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తిని సేకరించారు. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే పార్టీలలో అంతర్గత వర్గపోరు, స్థానిక నేతలపై వ్యతిరేకత, అసంతృప్తి నాయకుల జాబితాను తీసుకున్నారు. చాలా సందర్భాల్లో ద్రవిడ పార్టీల నేతలే రహస్య సమాచారం అందించారు.
చేరికల నుంచి సీట్ల కేటాయింపు వరకు అంతా వ్యూహాత్మకమే!
టీవీకే పార్టీలో కీలక నేతల నియామకం కూడా వ్యూహాత్మకంగానే జరిగింది. అన్నా డీఎంకే నుంచి కేఏ సెంగొట్టాయన్, వీ సత్యభామ, జేసీ డీ ప్రభాకర్ వంటి నేతలను ఆకర్షించగా, తిరువెరుంబుర్ నుంచి నావల్‌పట్టు విజి, కొలత్తూర్ నుంచి వీఎస్ బాబు వంటి డీఎంకే నాయకులు కూడా టీవీకేలో చేరారు. గతంలో డీఎంకే పాలనలో ఇబ్బందులను ఎదుర్కొన్న టెక్ట్స్‌టైల్ వ్యాపారులు, ప్రైవేట్ స్కూల్ యజమానులు, హోటల్ వ్యాపారులు టీవీకేకు తమ మద్దతు అందించారు.
దీంతోపాటు కుల సమీకరణలను కూడా ఎలాంటి ఆధిపత్యానికి తావు లేకుం డా ఎంతో వ్యూహాత్మకంగా విజయ్ పార్టీ అమలు చేసింది. వన్నియార్ వర్గానికి చెందిన 37 మందికి, ముక్కులత్తోర్ వర్గానికి చెందిన 25 మందికి టికెట్లు ఇచ్చింది. ముస్లింలు, క్రైస్తవులకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. 120 జిల్లా కార్యదర్శుల్లో 16 మంది దళితులను నియమించడం ద్వారా సామాజిక సందేశం పంపించింది.
ఇదే వ్యూహం చెన్నై వంటి పట్టణ ప్రాంతాల్లో యువ ఓటర్లను ఆకర్షించింది. డిజిటల్ క్యాంపెయిన్ టీవీకే విజయానికి ప్రధాన ఆయుధంగా మారింది. వ్యూహకర్త జాన్ ఆరోకియస్వామి సోషల్ మీడియా నేరేటివ్స్ రూపొందించి, యువతకు చేరేలా రీల్స్, మీమ్స్, షార్ట్ వీడియోలు తయారు చేశారు. విజయ్ ప్రసంగాలు కూడా ముందుగానే స్క్రిప్ట్ చేసి, సమయం, భావోద్వేగం, పదజాలం అన్నీ కచ్చితంగా ప్లాన్ చేశారు.
విజయ్ కాదు.. వ్యూహమే గెలిచింది..
విజయ్ వ్యక్తిగత జీవితంపై వచ్చిన వివాదాలు, విడాకుల ప్రచారం వంటి అంశాలను కూడా వార్ రూమ్ సమర్థంగా ఎదుర్కొంది. ప్రతి విమర్శనూ సిస్టమ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న కొత్త నాయకుడు అనే కోణంలో భావోద్వేగంగా మలిచింది. విజయ్ స్వయంగా పలుమార్లు వీవోసీ కార్యాలయాన్ని సందర్శించి యువ బృందంతో సమావేశమయ్యారు. ఆయన సన్నిహితుడు ఆధవ్ అర్జున వంటి నాయకులు కూడా బృందానికి మానసిక బలం ఇచ్చారు. గతంలో ఎవరూ పట్టించుకోని ప్రజల ఆవేదనను కూడా వినాలి అనే సిద్ధాంతంతో బూత్‌స్థాయి వ్యూహాన్ని అమలు చేశారు.
సాంప్రదాయ ద్రావిడ రాజకీయాలకు భిన్నంగా టీవీకే అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా సీరియస్ ప్రత్యామ్నాయంగా ప్రజల్లో గుర్తింపు పొందింది. అవినీతి వ్యతిరేక నినాదాలు, కొత్త తరహా పాలన హామీలు యువతను బలంగా ఆకర్షించాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీవీకేకు పరిపాలన రూపంలో అసలు పరీక్ష ఎదుర్కోనున్నది. ఎన్నికల వ్యూహంలో విజయం సాధించిన ఈ జెన్ జెడ్ వార్ రూమ్, పరిపాలనలో కూడా అదే సామర్థ్యం చూపగలదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే సినిమా స్టార్ ఇమేజ్ ఒక్కటే విజయ్‌ని అధికారానికి తీసుకురాలేదనే అంశం మాత్రం స్పష్టమైంది. స్ప్రెడ్ షీట్లు, సోషల్ మీడియా, బూత్‌స్థాయి డేటా, యువత మానసికత, సైలెంట్ స్ట్రాటజీ వంటివి అన్నీ కలిసి తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం లిఖించాయి. సహనం, కచ్చితత్వం, ప్రజల భాగస్వామ్యంతో కూడిన వారి ఫార్ములా ఇతర రాష్ట్రాలకు కూడా పాఠాలు నేర్పుతోంది.






