కేంద్రంపై ఏఐసీసీ చీఫ్ మండిపాటు
సామాన్యుల పొదుపును తగలేసేందుకు పెట్రోల్ చల్లుతోందన్న ఖర్గే
న్యూఢిల్లీ, మే 25: పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచడంపై సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ’వాయిదాల పద్ధతిలో దోపిడీ’కి పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజల సంపాద నను విడతల వారీగా దోచుకుంటుందన్నారు. సామాన్యులు కూడబెట్టుకున్న పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతుందని విమర్శించారు.
ఈ దోపిడితో ఎవరు బాగుపడుతున్నారని ఖర్గే ప్రశ్నించారు. కేవలం రెండు వారాల్లోనే ఐదుసార్లు పెంచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో లీటర్ పెట్రోల్ రూ.71.41 గా ఉంటే ఇప్పుడు రూ.102.12కు చేరుకుందన్నారు. ప్రజల అవసరాల కంటే లాభానికే ప్రాధాన్యం ఇవ్వడం బీజేపీ నైజమని ఖర్గే పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లలో 43 లక్షల కోట్ల రూపాయలను దోచుకుందని, అంటే ప్రతిరోజూ వెయ్యి రూపాయల దోపిడీ జరిగిందని అన్నారు.






