అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్ల గ్యాంగ్ అరెస్ట్
ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి
ఆదిలాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): సైబర్ క్రైమ్ పై ఉక్కు పాదం మోపుతూ, సైబర్ క్రైమ్ నేరాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం మరో అడుగు ముందుకు వేసిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా ను అరెస్టు చేయడం జరిగిందన్నారు. సోమవారం ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. స్థానిక ఎన్టీఆర్ చౌక్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయం లో నలుగురు సైబర్ మోసగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాత సెల్ఫోన్లను కొనుగోలు చేసి అందులోని వివిధ విభాగాలను ఇతర ఫోన్ లకు బిగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమం లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెంది న మొహమ్మద్ ఇర్ఫాన్, సాహిల్, అనాస్, ఓ బాల నేరస్థున్నీ అరెస్టు చేశామన్నారు. నిందితులు కొంతకాలంగా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల వద్ద నుండి పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరలకు కొనుగోలు చేసి, వాటిలోని మదర్‌బోర్డులు, బ్యాటరీలు, సాకెట్లు వేరుచేసి ఇతర రిపేర్ చేసిన ఫోన్లలో అమర్చేవారు.
పాత మొబైల్ ఫోన్ల ద్వారా కస్టమర్ల డేటా, ఐఎంఈఐ నంబర్లు సేకరించి బ్యాంకు అధికారులమని చెప్పి అమా యక ప్రజలను మోసం చేసి, ఓటీపీలు పొం దుతూ వారి ఖాతాల నుండి డబ్బులు దోచుకున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. మిగి లిన స్క్రాప్ మొబైల్ ఫోన్లను ఢిల్లీలో తెలియని వ్యక్తులకు విక్రయించి లాభాలు ఆర్జించేవరన్నారు.
ఆదివారంన రెండు బ్యాగులు, చిన్న కవర్లలో స్క్రాప్/పాత మొబైల్ ఫోన్లు (దాదాపుగా 1500) తీసుకుని ఆదిలాబాద్ బస్ స్టాండ్ వైపు వెళ్తుండగా, ఎన్టీఆర్ చౌక్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి పరస్పర సమాచారం పంచుకోవడానికి ఉపయోగించిన నాలుగు సెల్ ఫోన్లు, పాత మొబైల్ ఫోన్లు, మదర్బోర్డులు, బ్యాటరీలు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్త్స్ర నాగనాథ్, అశోక్, రమ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




