కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా అరెస్ట్
ఖైరతాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం.ఎస్. మఖ్తా ప్రాంతంలో మెరుపు దాడి నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ దాడిలో భారీ ఎత్తున సాగుతున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం గుట్టును బట్టబయలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, మానవ ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలు కలుపుతూ జేజే ఫుడ్స్ పేరుతో ఈ కల్తీ వ్యాపారం సాగిస్తున్న అబిడ్స్ నివాసి జసాని ఇల్యాన్ (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు గడువు ముగిసిన లైసెన్స్ను వాడుతూ ఈ కల్తీ పేస్ట్ను హోటళ్లు, కిరాణా షాపులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో సుమారు 4000 కేజీల కల్తీ పేస్ట్తో పాటు, గ్రైండింగ్ మెషీన్లు, ఎసిటిక్ యాసిడ్, పసుపు పొడి, ఉప్పు, రవాణాకు ఉపయోగించే ఒక గూడ్స్ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం అతడిని లేక్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.ఈ దాడిలో ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి.రాఘవేందర్, ఎస్.ఐ. జి. శ్రీకాంత్, లేక్ పి.ఎస్. ఎస్.ఐ. ఎన్. శివ శంక ర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




