11 May, 2026 | 2:10 AM

ధాన్యం కొనుగోళ్ల్ల కిరికిరి

11-05-2026 12:56 AM
  1. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఆగం 
  2. ఆందోళన చేస్తున్న రైతన్నలు 
  3. రైస్ మిల్లుకు తరలించే వరకు రైతులదే బాధ్యత 
  4. రోడ్డు ఎక్కుతున్న అన్నదాతలు

కామారెడ్డి, మే 10 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు లో కిరికిరి తప్పడం లేదు. అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతుంది. కామారెడ్డి జిల్లాలో దాన్యం కొనుగోలు తెచ్చిన రైతులకు తంటాలు తంటాలు తప్పడం లేదు. గతంలో కొనుగోలు కేంద్రం తెచ్చినా ధాన్యం కాంట అయిన తర్వాత లోడింగ్ పెట్టి వెళ్లితే సరిపోతుంది.

ఈ సీజన్లో మాత్రం అధికారులు రైతుల పై మరో భారం వేసారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన నుంచి రైస్ మిల్లులో అన్లోడ్ అయ్యే వరకు రైతులే బాధ్యత వహించాలని చెబుతుండడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజులపాటు ధాన్యం వెంటే రైతులు పడిగాపులు కాస్తూ ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షం వచ్చేస్తే రైతులే నష్టపోవాల్సి ఉండడంతో దినదిన గండంగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన నుంచి రైస్ మిల్లుకు తరలించి అన్లోడ్ చేసే వరకు రైతులు ధాన్యం వెంటే ఉంటున్నారు.

అధికారులు నిర్లక్ష్యం సమాధానం చెప్పడంతో పాటు తూకం వేయడంలో కూడా ఆలస్యం చేస్తున్నారు. దాంతోపాటు రైస్ మిల్లు వద్దకు వెళ్లిన అన్లోడ్ చేసేందుకు రెండు రోజులు వేచి చూడాల్సి వస్తుందని రైతులంటున్నారు. ఇన్ని నిబంధనలు పెట్టడంతోపాటు తూకంలో తరుగు పేరిట క్వింటాల్కు నాలుగు కిలోలు నొక్కేస్తున్నారు. బస్తాకు రెండు కిలోలు చొప్పున క్వింటాలకు నాలుగు కిలోలు దోచేస్తున్నారు. అధికారులకు చెబితే అది అంతే  అంటూ సెలవిస్తున్నారు. దీంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తోచక ఆందోళనకు గురవుతున్నారు. తీవ్రంగా రైతులు నష్టపోతున్నారు.

ప్రజా ప్రతినిధులు సైతం రైతుల గోడును పట్టించుకోవడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రం వచ్చిన వెంటనే తేమ శాతం సరిచూసుకొని కాంటపెట్టాల్సిన అధికారులు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోవడం లేదు. అన్నీ కూడా రైతే చూసుకోవాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. దీంతో రైతులు వారం నుంచి 15 రోజులపాటు ధాన్యం తరలించే ప్రక్రియ పూర్తయ్యే వరకు నిత్యం ధాన్యం చుట్టే తిరగాల్సి వస్తుంది అని రైతులంటున్నారు.

ధాన్యం తూకం వేసిన లారీల సమస్య రైతులను వేధిస్తుంది. అన్లోడింగ్ సమస్య ఎదురు కావడంతో రైతులు నిత్యం అవస్థలు పడుతున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా  వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జిల్లాలో పలుచోట్ల రైతులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చేతికొచ్చిన ధాన్యం అకాల వర్షాలకు నష్టపోకుండా అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ధాన్యాన్ని తరలించి అన్లోడ్ చేయించాలని కోరుతున్నారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులు రైతులను నిలువు దోపిడికి గురి చేస్తు, నష్టపరుస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

నిరంతరం పర్యవేక్షిస్తున్నాం 

కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని జిల్లా సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. రైతుల ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ లో ఇటీవల రైతులు అన్లోడింగ్ సమస్య ఉందని రోడ్ ఎక్కిన విషయం వాస్తవమే అన్నారు. వెంటనే స్పందించి వారికి అన్లోడింగ్ సమస్య లేకుండా లారీలను పంపి లోడింగ్ చేయించి పంపించినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న జిల్లా అధికారుల దృష్టికి తేవాలని కోరారు.

వెంకటేశ్వర్లు, జిల్లా సివిల్ సప్లై అధికారి, కామారెడ్డి