ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి
కలెక్టర్ దివాకర్ టీఎస్
గణేష్ నిమజ్జనం సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి
కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్నగర్, తీర్థాల వద్ద గణేష్ నిమజ్జనం ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, ఆగస్టు 26 (విజయక్రాంతి): ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు.
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పోలీసు అధికారులు, స్తంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు.
భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
నిమజ్జనం పాయింట్ల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలి. గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తగినంత లైటింగ్, బ్యారికేడ్లు, తాగునీటి సరఫరా, మొబైల్ టాయిలెట్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. నిమజ్జనం సమయంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. నిమజ్జనం పాయింట్ల వద్ద గజ ఈతగాళ్లను, ఎస్డిఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన రక్షణ పరికరాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో పూర్తి స్థాయిలో సమన్వయంతో సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రామాంజనేయులు, ఇరిగేషన్ సీఈ వసంతి, ఎస్‌ఈ ఎం. వెంకటేశ్వర్లు, ఏసిపి లు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ జయచందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






