6 April, 2026 | 1:28 PM

కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి — గజ్వేల్‌‌‌‌ బంద్

06-04-2026 11:28 AM

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో(Gajwel Constituency) బంద్ కొనసాగుతోంది. దీంతో వ్యాపారాలు నిలిచిపోయాయి. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. గజ్వేల్ బంద్‌లో భాగంగా నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

బీఆర్ఎస్ నేత ప్రతాప్ రెడ్డి(Vanteru Pratap Reddy) మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ కి దాడుల సమాచారం ఉందా?లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. హామీలను మరిచి ప్రతిపక్షాలపై దాడులు చేయడం ఏంటని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా వారి ఆఫీసుల్లో నరేంద్ర మోదీ(Narendra Modi) ఫొటో పెట్టారా?, బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆఫీసుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిస్తారా? అని ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు.