‘సర్’ను తనిఖీ చేసిన తహసీల్దార్
ఘట్ కేసర్, జూలై 12 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి, చౌదరిగుడలోని ఓటరు నమోదు బూత్ ను ఘట్ కేసర్ తహసిల్దార్ చంద్రశేఖర్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బి ఎల్ వో మంజుల, బూత్ లెవల్ ఏజెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కే. వినోద్ కుమార్ ని బూత్కు సంబంధించిన వివరాలు, ఓటరు నమోదు ప్రక్రియ, ప్రజలకు అందజేస్తున్న దరఖాస్తు ఫారాలు, వాటి నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు అవసరమైన అన్ని ఫారాలను అందుబాటులో ఉంచి, ప్రతి ఒక్కరికీ అందజేస్తూ బాధ్యతాయుతంగా పనిచేస్తున్న విధానాన్ని తహసిల్దార్ చంద్రశేఖర్ అభినందించారు. అలాగే ప్రజల నుంచి నింపిన ఫారాలు తిరిగి అందేలా మరింత చొరవతో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాలడుగు అమరేందర్ రెడ్డి పాల్గొని పరిధిలోని 9 పోలింగ్ బూత్లకు సంబంధించిన వివరాలను తహసిల్దార్ కి వివరించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రతి కార్యకర్త, ప్రతి బీఎల్‌ఏ నిబద్ధతతో పనిచేయాలని అధికారులు సూచించారు.






