అధికార గర్వానికి చెంపపెట్టు
బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్
ఖానాపూర్,(విజయక్రాంతి): అధికారంలో ఉన్నామని గర్వం చూపిస్తే ఎప్పటికైనా ప్రజలు చేతిలో భంగపాటు తప్పదని ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి(BRS Khanapur Constituency) భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీ కైవసం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో ముందుగా ప్రస్తుతం టిఆర్ఎస్ కౌన్సిలర్ , పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి రాజా గంగన్న మాట్లాడుతూ మొత్తం 12 కౌన్సిలర్ అభ్యర్థులకు గాను తమ పార్టీలో ఇద్దరం దళిత వర్గానికి చెందిన వారు గెలుపు పొందగా, ప్రజా తీర్పును అపహాస్యం చేసి కాంగ్రెస్ అధికార గర్వంతో ఒక ఎస్సీ కౌన్సిలర్ అభ్యర్థిని ఎత్తుకుపోయినప్పటికీ చిట్ట చివరకు న్యాయం గెలిచిందని అన్నారు.
అనంతరం భూక్య ఝాన్సన్ నాయక్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ని పన్నాగాలు పన్నినప్పటికీ చివరికి ప్రజా తీర్పు గెలిచిందని అన్నారు. అధికార గర్వంతో ఎమ్మెల్యే రాద్ధాంతం చేసి కొద్ది రోజులు ఎన్నిక ఆపగలిగారు కానీ చివరికి న్యాయం గెలిచిందని అన్నారు. తాము మైనార్టీ దళితులకు జనరల్ స్థానంలో అధికారం కల్పిద్దామని ప్రయత్నించినప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ ఓర్వలేని తనం కొట్టొచ్చినట్లు కనిపించిందని విమర్శించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే బుద్ధి తెచ్చుకొని తమ పంతం మార్చుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. సమావేశంలో టిఆర్ఎస్ కౌన్సిలర్ సభ్యులు ప్రస్తుత వైస్ చైర్మన్ షోయబ్ ,ఇందిరా, తాళ్లపల్లి రాజ గంగన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సకారం శ్రీనివాస్ ,రాథోడ్ రాము నాయక్, గౌరీకర్ రాజు ,తదితరులు ఉన్నారు.




