10 April, 2026 | 3:01 AM

పెద్దితో ఆటాపాట!

10-04-2026 01:32 AM

రామ్‌చరణ్ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న చిత్రం ’పెద్ది’. ఇందులో రామ్‌చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ విషయమై కొంతకాలంగా పెద్దఎత్తున చర్చ కొనసాగుతోంది.

షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని, కేవలం ఒకేఒక్క పాట చిత్రీకరణ మిగిలి ఉందని రామ్‌చరణ్ ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు. ఆ మిగిలిన పాటే ఐటమ్ సాంగ్ అని సమాచారం. అయితే, ఈ ప్రత్యేక గీతంలో ఎవరు నటిస్తారనే విషయమై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ పాటలో నటించే హీరోయిన్ అంటూ మృణాల్ ఠాకూర్ సహా మరికొందరు స్టార్ భామల పేర్లు వినిపించాయి.

తాజాగా, ఎవరూ ఊహించని ఓ యంగ్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’తో మెప్పించిన మానస వారణాసిని ఈ ఐటమ్ సాంగ్ కోసం ఎంపిక చేయాలని దర్శకుడు బుచ్చిబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో ప్రాథమిక చర్చలు కూడా జరిపారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ క్రేజీ బ్యూటీ ‘పెద్ది’తో కలిసి స్టెప్పు లు వేయనుందన్న మాట.