1 March, 2026 | 2:52 PM

స్పష్టమైన చూపు సురక్షిత డ్రైవింగ్‌కు కీలకం

01-03-2026 12:10 PM

• ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా నివారించవచ్చు.

• ప్రతి వాహనదారుడు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంతోనే ఆరైవ్-ఆలైవ్ కార్యక్రమం

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఆరైవ్–ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా నాగిరెడ్డిపేటలో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరైవ్–ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా, కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు ప్రారంభించారు. రాజంపేట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎల్లారెడ్డి వారి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో డాక్టర్ రామ్మోహన్ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు.

పరీక్షల అనంతరం అవసరమైన డ్రైవర్లకు కంటి అద్దాలను ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి మరియు నాగిరెడ్డిపేట ఎస్సై శ్రీ భార్గవ్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. వయస్సు పెరిగే కొద్దీ కంటి చూపు మందగించడం సహజమని, ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాలను నడిపే డ్రైవర్లు తమ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చే బాధ్యత డ్రైవర్లపై ఉందని పేర్కొన్నారు. కంటి చూపు సమస్యలతో వాహనం నడపడం ప్రమాదాలకు దారితీసే అవకాశముందని, అందువల్ల డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని తెలిపారు.మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, అధిక వేగం, ఓవర్ లోడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ వినియోగం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ శిబిరం నిర్వహణకు సహకరించిన రాజంపేట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి నాగిరెడ్డిపేట ఎస్‌హెచ్‌ఓ  భార్గవ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, నాగిరెడ్డిపేట ఎస్‌హెచ్‌ఓ భార్గవ్ గౌడ్  పోలీసు సిబ్బంది, పలువురు డ్రైవర్లు, వైద్యులు పాల్గొన్నారు.