మునగాలలో ఉచిత కంటి వైద్యశిబిరం విజయవంతం
ఉచితంగా 25 మందికి కంటి ఆపరేషన్లు, మరో 35 మందికి కంటి అద్దాల పంపిణీ
అలంపూర్, మే 27: గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునుగాల గ్రామంలో ఏనుగొండ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రి లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో మండల కేంద్రానికి చెందిన గౌని జగదీశ్వర్ రెడ్డి,గౌని నరేందర్ రెడ్డి మరియు గౌని లలిత గార్ల ఆధ్వర్యంలో మునుగాల గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది.
ఈ వైద్య శిబిరానికి మునగాల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు100 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో ముఖ్యంగా 29 మంది బాధితులు తీవ్ర కంటి సమస్యలతో ఉన్నట్లు వైద్య బృందం గుర్తించి వారికి అవసరమైన శస్త్ర చికిత్సల నిమిత్తం మహబూబ్ నగర్ లోని రామ్ రెడ్డి లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రికి గురువారం ఉచితంగా బస్సులో తరలించినట్లు వారు పేర్కొన్నారు.
కంటి ఆపరేషన్ నిమిత్తం ముగ్గురికి అదనపు సాయంగా 45 వేల ఆర్థిక సాయాన్ని గౌని వారి కుటుంబం తరఫున నరేందర్ రెడ్డి అందించారు. అదేవిధంగా కంటి అద్దాల పంపిణీ నిమిత్తం 35 మందికి శ్రీ లలిత హరి సర్వోత్తమ్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద ప్రజలు వెనుకబడిన మారుమూల ప్రాంత ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించాలని ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ కొప్పుల ప్రభాకర్ రెడ్డి, ఇటిక్యాల సర్పంచ్ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.






