3 August, 2026 | 10:32 PM

రెవెన్యూ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

03-08-2026 09:06 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రజల దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అంశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ భారతి, ప్రజావాణి, సీఎం ప్రజావాణి, రెవెన్యూ సదస్సులు, సదాబైనామా తదితర భూ సమస్యలకు సంబంధించిన దీర్ఘకాలిక పెండింగ్ దరఖాస్తులను ప్రత్యేక దృష్టితో త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తుల వివరాలను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.

ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అన్ని దరఖాస్తులను పూర్తి చేయాలని, పరిష్కారం కాని వాటిని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తిరస్కరించే దరఖాస్తులకు స్పష్టమైన కారణాలను నమోదు చేయాలని, ప్రజల వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. భూముల సర్వే, రీ-సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.