3 August, 2026 | 10:33 PM

మండలంలో 1/70, పీసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి

03-08-2026 09:03 PM

- తుడుందెబ్బ డిమాండ్

- మాట్లాడుతున్న జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య

గుండాల,(విజయక్రాంతి): ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో సోమవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. గుండాల మండలం పూర్తిగా ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నందున ఇక్కడ 1/70 (LTR), పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం (FRA/ROFR) పూర్తిస్థాయిలో అమలులో ఉన్నాయని తెలిపారు.

అయినప్పటికీ గిరిజనేతరులు ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ ఆదివాసీల భూములను, ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. మండలంలో 1/70, పీసా చట్టాలను ఖచ్చితంగా అమలు చేసి, అక్రమ వడ్డీ వ్యాపారులు, భూ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలో అధికారిక లైసెన్స్ కలిగిన పెట్టుబడిదారులు ఏడుగురు ఉండగా అనధికారికంగా సుమారు 50 మంది వరకు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారని, వీరంతా రైతులకు అప్పులు ఇచ్చి ఆదివాసీలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ మండల కేంద్రంలో సుమారు 38 మంది గిరిజనేతరులు ఇంటి స్థలాలు కొనుగోలు చేసి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకున్నారని, మండల కేంద్రం నుంచి పెట్రోల్ బంక్ వరకు ఒక గుంట భూమి రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు కొనుగోలు, అమ్మకాలు జరుగుతున్నాయని, ఇది చట్టవిరుద్ధమైన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నిదర్శనమని అన్నారు. ఇటీవల కొందరు కేవలం ఇద్దరు పెట్టుబడిదారుల గురించి మాత్రమే ప్రచారం చేశారని కానీ వాస్తవానికి మండలంలో సుమారు 50 మంది వరకు అక్రమ వడ్డీ వ్యాపారులు ఉన్నారని పేర్కొన్నారు.

వీరందరిపై తెలంగాణ వడ్డీ వ్యాపార నియంత్రణ చట్టం, 1/70 నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించి, వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అధికారులు స్పందించకపోతే తుడుందెబ్బ ఆధ్వర్యంలో దశలవారీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.