3 August, 2026 | 10:34 PM

పారిశుధ్య కార్మికులను కొనసాగించాలని గ్రామసభలో గ్రామస్తుల కార్యదర్శికి వినతి పత్రం

03-08-2026 09:20 PM

మహా ముత్తారం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాముత్తారం మండలం, కొర్లకుంట గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న బొబ్బిలి సారక్క, బొజ్జ లక్ష్మీనారాయణలను విధుల నుంచి తొలగించవద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శి సమ్మరాజుకు గ్రామ సభలో వినతిపత్రం అందజేశారు.

గ్రామసభకు హాజరైన 41 మంది సభ్యుల్లో 29 మంది గ్రామస్తులు పారిశుధ్య కార్మికులను కొనసాగించాలని సంతకాలు చేసి తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశారు. మెజార్టీ గ్రామ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వారిని కొనసాగించేందుకు తీర్మానం చేయాలని వారు కోరారు.

పలు కారణాలు చూపుతూ వారిని తొలగించాలని ఇటీవల గ్రామపంచాయతీ పాలకవర్గం చేసిన తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోవద్దని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో పారిశుధ్య సేవలు కొనసాగించేందుకు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కార్మికులనే కొనసాగించాలని కోరుతూ తమ వినతిపత్రాన్ని కార్యదర్శికి సమర్పించారు.