కలెక్టర్ మేడమ్ జెర దేఖో...రికార్డుల తారుమారు.. నిధులు గోల్‌మాల్!
- నిబంధనలకు నీళ్లు... నిధులకు కాళ్లు
- అందిన కాడికి అప్పనంగా దోచుకున్నారు
- ప్రశ్నార్ధకమవుతున్న జిల్లా పంచాయతీ అధికారి పనితీరు
కరీంనగర్/ మానకొండూరు, మే 21 (విజయక్రాంతి) : కరీంనగర్ జిల్లా మానకొం డూరు మండలం జగ్గయ్యపల్లి గ్రామపంచాయతీలో ఆరు సంవత్సరాల పాటు( 2019 - 2025 ) యధేచ్చగా, ఏకపక్షంగా అడ్డు అదు పు లేకుండా నిధుల స్వహ పర్వం కొనసాగింది. ‘తరచి చూసిన బోధపడవులే దైవచి ద్విలాసాలు‘ అన్న చందంగా గ్రామ పంచాయితీలో తవ్విన కొద్దీ అక్రమాల, అవినీతి అనకొండ గుట్టువీడుతుంది. ‘వడ్డించేవారు మనవారైతే‘ బంతిలో ఎక్కడున్నా పరవాలే దు అన్న రీతిలో పంచాయతీ కార్యదర్శి తన బావమరిదికి, భార్యకు గ్రామపంచాయతీ నిధులను ఏకపక్షంగా దారాదత్తం చేసి కు టుంబ పాలన సాగించిన వైనం ప్రజలను విస్తు గొలుపుతోంది.
కార్యదర్శి, కారోబార్ పరస్పర సహకారంతో పంచాయితీ నిధులను సొంతంగా వాడుకోవటానికి అడ్డదారు లు వెతికి, అక్రమార్జనకు తెర లేపారు. కారోబార్ కొడుకు పేరుపై బకాయిల పేరిట నిధులను మళ్లించిన తీరు పై గ్రామస్తులు మండిపడుతున్నారు.అప్పటి జగ్గయ్యపల్లి పంచాయతీ కార్యదర్శి గుంటుకు స్వాతి పేరిట, పారిశుద్ధ్య కార్మికుల జీతాల పేరుతో 25,500 రూపాయలు బదిలీ చేసినట్లు ఆరోపణలున్నాయి. గ్రామంలో మోటార్ రిపేర్ పనులు చేసినట్లు చూపిస్తూ మరో 22,000 రూపాయలు చెల్లించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. గుంటుకు స్వాతి అప్పటి కార్యదర్శి భార్య. తన బావమరిది అరవింద్ కు లక్షల్లో, తన అత్తమ్మకు వేల రూపాయలు చెల్లింపులు జరిగినట్లు ఆధారాల తో సహా గ్రామస్తుల చేతికి చిక్కడం, గ్రామంలో సంచలనం రేపింది.
గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఒక్క మోటార్ మాత్రమే ఉన్నప్పటికీ, మోటార్ రిపేర్ల పేరుతో మొత్తం 3,55,047 రూపాయలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో నమోదైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈఎంఐ ఇంకా పెండింగ్లో ఉండటం ఇక్కడ గమనార్హం. 2024 మార్చి - 2025 డిసెంబర్ వరకు స్పెషల్ ఆఫీసర్ పాలనలో చాలావరకు గ్రామసభలు నిర్వహించకపోయినా నిర్వహించినట్లు తప్పుడు తీర్మాన రిజిస్టర్లు సృష్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.కారోబార్ ప్రభాకర్ కుమారుడు గజ్జెల శ్రీధర్కు 20212022 సంవత్సరాల మధ్యకాలంలో పారిశుద్ధ్య కార్మికుని జీతంగా 1,39,000 రూపాయలు చెల్లించినట్లు రికార్డులు ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు.
అదనంగా పల్లె ప్రగతి పనులు, చెట్ల తొలగింపు, లేబర్ల ఏర్పాటు, సానిటేషన్ మెటీరియల్ కొనుగోలు వంటి పనుల పేరుతో మరో 1,54,623 రూపాయలు చెల్లించినట్లు ఆరోపిస్తున్నారు. జగ్గయ్యపల్లి గ్రామంలో 2021 సంవత్సరం నవంబర్ మాసంలో కేవలం 18 రోజుల్లోనే 180 ట్యాంకర్ల నీటి సరఫరా చేసినట్లు రికార్డుల్లో చూపించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఈ బిల్లులను ఒక్కోటి 45 వేల చొప్పున విభజించి, కారోబార్ కుమారుడు, అప్పటి పంచాయతీ కార్యదర్శి బావమరిది ఖాతాలకు రూ 90,000 రూపాయలు చెల్లింపులు చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
పేరుకే విచారణ జగ్గయ్యపల్లి
.విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అధికారికంగా సమర్పించకముందే, అదే నివేదిక ప్రతిని గ్రామస్థులకు చూపిస్తూ ఇదే ఫైనల్ రిపోర్ట్ అంటూ వివరించినట్లు సమాచారం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం గ్రామస్థుల వద్ద ఉన్న ఆ నివేదిక ప్రతులు ఉన్నతాధికారుల వద్ద ఇప్పటికీ లేవని, ఇదే విషయాన్ని డి పి ఓ ప్రజావాణిలో అంగీకరించినట్లు గ్రామస్థులు తెలిపారు. విచారణలో భాగంగా ఇచ్చిన ఫిర్యాదులు, వాంగ్మూలాలు సైతం డిఎల్ పి ఓ పట్టించుకోకుండానే తనకు నచ్చినట్టు రిపోర్టును తయారు చేసినట్లు సమాచారం.
తారుమారైన రికార్డులను గ్రామస్థులు, ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి స్వీకరించేందుకు నిరాకరించగా, దుర్భాషలాడి డి ఎల్ పి ఓ, సెక్రటరీ పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే మూడు సార్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం, అప్పటి కార్యదర్శిని కాపాడేందుకు, జిల్లా స్థాయి అధికారుల అండదండల తో పాటు, ‘తిలాపాపం తలాపిడికెడు‘ అన్న తీరుగా ఉన్నతాధికారులు సైతం పంచాయతీ కార్యదర్శి తో అంటకాగారనే ఆరోపణలు గ్రామంలో బలంగా వినపడుతున్నాయి.






