8 July, 2026 | 8:54 PM

నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

08-07-2026 08:01 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగర కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్‌లో రూ.39.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, సీసీ డ్రైన్‌ను, 9వ డివిజన్ లో నూతన సీసీ రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా 21వ డివిజన్‌లో రూ.39.80 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ పనులను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన రహదారి, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు.అదే సందర్భంగా 9వ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. నగరంలోని ప్రతి కాలనీకి సమాన ప్రాధాన్యత ఇస్తూ దశలవారీగా రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులను చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్  కమిషనర్ ప్రపుల్ దేశాయ్ , 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నర్సింగం , 22వ డివిజన్ కార్పొరేటర్ బండ రమణారెడ్డి , పడిశెట్టి భూమయ్య , మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు మరియు  డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.