బాధ్యతారాహిత్యంతో బలవుతున్న నిండు ప్రాణాలు
- తల్లిదండ్రుల అతి గారాభం
- వద్దంటే ప్రాణాలను ఏమి చేసుకుంటారోననే భయం
- పోలీస్ శాఖ చేస్తున్న కృషి వృథా
- మండలంలో రోజురోజుకీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
గుండాల, (విజయక్రాంతి): గత కొంత కాలంగా మండలంలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాలను గమనిస్తే అత్త్తారింటికి ద్విచక్ర వాహనంపై ఒక కుటుంబం మొత్తం వెళ్తున్న సందర్భంలో మూల మలుపు వద్ద వాహనం అదుపు తప్పి క్రిందపడడంతో ఆ ప్రమాదంలో చిన్న పిల్లవాడు మృతి చెందగా, తల్లికి తొంటి, తండ్రికి చేయి విరగడంతో ఆనందంగా ఉండాల్సిన కుటుంబంలో ఆ రోడ్డు ప్రమాదం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. మండల పరిధికి చెందిన ఒక గ్రామంలో తనకు పుట్టిన బిడ్డను చూడడానికి తండ్రి దూర ప్రాంతం నుండి ద్విచక్ర వాహనంపై వస్తుంటే అనుకోకుండా జరిగిన ప్రమాదంలో అతను మృత్యువాత పడితే ఆ కుటుంబ పరిస్థితి అగమ్యగోచరం. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో నిండా ఇరువై ఏళ్ళు కూడా నిండని కన్న కొడుకు ఆ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై నుండి పిట్టలా రాలిపోయి మరణిస్తే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఇలా చెప్పుకుంటూ పోతే మండలంలో రోజురోజుకీ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాల బారిన పడి తీవ్రంగా గాయపడడమో లేక ప్రాణాలను సైతం కోల్పోవడం జరుగుతూ పరిపాటి అయింది.
మండలంలో ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలు, పలు రకాల వాహనాలు విపరీతంగా పెరగడంతో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాలకు గురవుతున్న వారిలో ఎక్కువగా ఆదివాసీ మైనర్లు, యువత ఉండడం ఆందోళన కలిగించే విషయమని ఆదివాసీ సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలను నడిపేటప్పుడు తీసుకోవాల్సిన నియమాలు పాటించకపోవడం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలను నడపడం దీనికి ప్రధాన కారణాలుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. మైనర్ల తల్లిదండ్రుల అతి గారాభం ఒక ఎత్తు అయితే పిల్లలు తమకు నచ్చిన బైక్ కొనివ్వాలని వత్తిడి తెస్తుండడంతో తల్లిదండ్రులు కాదనకుండా తమ పిల్లలు తమకు ఇష్టమైన బైక్స్ కొనివ్వకపోతే క్షణికావేశంలో ఏమి చేసుకుంటారోనన్న భయంతో మేజర్లు కాక ముందే వారికి నచ్చిన స్పోర్ట్స్ బైక్ లను కొనిస్తున్నారు.
ఆ స్పోర్ట్స్ బైక్స్ పై మైనర్లు, యువత అతి వేగంతో చివరికి తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి మండలంలో రోజురోజుకీ పెరిగిపోతుంది. ఒకవైపు స్థానిక పోలీస్ సిబ్బంది రోడ్డు భద్రతా నియమాలపై అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా కూడా రోడ్డు ప్రమాదాలతో పోలీస్ శాఖ చేస్తున్న శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోతుంది. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండ ఉండాలంటే ముందుగా తల్లిదండ్రుల పాత్రే కీలకమని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది మండల కేంద్రంలో విధిగా నిత్యం వాహన తనిఖీలు చేపట్టి వాహన పత్రాలను, డ్రైవింగ్ లైసెన్స్ లను తనిఖీలు చేయాలని, ద్విచక్ర వాహనాలను, ఆటోలను, ట్రాక్టర్లను నడిపే మైనర్లపై, లైసెన్స్ లేని వారిపై ప్రత్యేక దృష్టిసారిస్తే మండలంలో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని మండల ప్రజలు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ప్రాణ నష్టం జరగక ముందే తల్లిదండ్రులు, యువత, వాహనదారులు జాగ్రత్తలు తీసుకోక తప్పదు.






