3 August, 2026 | 12:56 PM

సులభ్ కాంప్లెక్స్ లేక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

03-08-2026 11:44 AM

చిన్న బజార్ వ్యాపారస్తులు, కార్మికులు,మహిళలు 

కొత్తగూడెం టౌన్, ఆగస్టు 3,(విజయక్రాంతి): పట్టణంలోని ప్రధాన వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన చిన్న బజార్ మెయిన్ మార్కెట్‌లో(Chinna Bazaar Main Market) సులభ్ కాంప్లెక్స్ (పబ్లిక్ టాయిలెట్) లేకపోవడంతో వ్యాపారులు, గుమస్తాలు, కార్మికులు, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, కొనుగోళ్ల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ఈ మార్కెట్‌కు వస్తుండగా, అత్యవసర అవసరాల కోసం సరైన మరుగుదొడ్డి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

గతంలో కొందరు వెనుక సందుల్లో మూత్ర విసర్జన చేసేవారు. అయితే ప్రస్తుతం ఆ మార్గాలను కూడా పూర్తిగా మూసివేయడంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఇలాంటి ప్రాథమిక సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత, మహిళల గౌరవం , వ్యాపార వాతావరణంపై ప్రతికూల ప్రభావం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల సంబంధిత మున్సిపల్ అధికారులు , ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి, కొత్తగూడెం చిన్న బజార్ మెయిన్ మార్కెట్‌లో శాశ్వత సులభ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని వ్యాపారులు, గుమస్తాలు, కార్మికులు , ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.