తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు
హైదరాబాద్: తెలంగాణలో సోమవారం నాడు మోస్తరు నుండి భారీ వర్షం(heavy rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరించింది. వాతావరణ సూచనల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ, తూర్పు, ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాలపై వర్షాల ప్రభావం ఉంటుందని, అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లో సాయంత్రం, రాత్రి వేళల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని, వర్షం కారణంగా ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ మందగించే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములతో కూడిన వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచిన ప్రాంతాల్లోకి వెళ్లవద్దని అధికారులు నివాసితులను కోరారు.






