రాష్ట్రంలో విద్యా పాలన అస్తవ్యస్తంగా ఉంది
ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యార్థుల సమస్యలే
పోరాటానికి టిఎస్ యుటిఎఫ్ సిద్దం
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి
కామారెడ్డి, ఆగస్టు 2 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల సమస్యలన్నీ విద్యారంగానికి సంబంధించినవేనని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో జరిగిన టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల అవగాహన లేకుండా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడిందన్నారు. హేతుబద్ధీకరణ జిఒ 25 ను హేతుబద్ధంగా సవరించాలని డిమాండ్ చేశారు. ఈ జీవో విద్యారంగానికి మరణ శాసనం లాంటిదని అన్నారు. సర్వీసు నిబంధనల సంక్షోభం పరిష్కారానికి చొరవ చూపాలని, డిఈఓ, డిప్యూటీ ఇఒ, ఎంఈఒ పోస్టులను మంజూరు చేయాలన్నారు.
ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని అన్ని హాస్పిటల్స్ లో సమర్థవంతంగా అమలు చేయటానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్పొరేట్ పాఠశాల ప్రారంభోత్సవాలకు హాజరై ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థిపై 1,80,000, ఖర్చు పెడుతున్నామని మరొక మారు ప్రతి సంవత్సరం 80,000 రూపాయల ఖర్చు పెడుతున్నామని వివిధ వేదికలలో వివిధ రకాలుగా తెలపడం శోచనీయమన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7 శాతం లోపు బడ్జెట్ కేటాయించడం వలన ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని అనడం విడ్డూరం అని అన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ఊతం ఇచ్చే విధంగా ఉందని విమర్శించారు.
నూతన విద్యా విధానం 2020 ని అమలు చేయడం వలన దేశవ్యాప్తంగా ఇప్పటికి 93 వేల పాఠశాలలో మూతపడ్డాయి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం సిపిఎస్ రద్దు చేయాలని, గురుకులాలు, కెజిబివి, మోడల్ స్కూల్స్,గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్ని గురుకులాల మాదిరిగా మహాత్మ జ్యోతిబా పూలే గురుకులాల టైం టేబుల్ ను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు సంబంధించి హైకోర్టులో వేసినటువంటి లీవ్ పిటిషన్ ను వెంటనే వెనక్కి తీసుకొని పాత పెన్షన్ అమలు చేయాలి డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డిఎ ల పై ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకొనకపోతే రాష్ట్రంలో ఉపాధ్యాయలను ,ఉద్యోగులను ఏకం చేసి దశల వారి పోరాటాన్ని ఉదృతం చేస్తామని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చావ దుర్గ భవాని, ఎం. రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి టీ లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వి . శాంతి కుమారి,డి. సత్యానంద్, ఎస్.మల్లారెడ్డి, బి. రాజు, కె. రంజిత్ కుమార్, ఎస్. రవి ప్రసాద్ గౌడ్, కె. రవి కుమార్, జి. శ్రీధర్, ఎ. సింహాచలం, వై. జ్ఞాన మంజరి, ఎం. వెంకటప్ప, పి వెంకటేశ్వర్లు, జే . యాకయ్య, సీనియర్ నాయకులు పి.మాణిక్ రెడ్డి, ఎన్. కిష్టయ్య, ఎస్ వై కొండల్ రావు, మస్తాన్ రావు, కామారెడ్డి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆకుల బాబు, సాయిలు 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






