3 August, 2026 | 10:40 AM

బంకీపూర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో ప్రశాంత్ కిశోర్

03-08-2026 09:54 AM

బంకీపూర్ : బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు(Bankipur Assembly by election) సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం పాట్నాలో ప్రారంభమైంది. రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఏప్రిల్‌లో తన స్థానానికి రాజీనామా చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కారణంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ లో 'జన్ సురాజ్ పార్టీ' చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

ప్రశాంత్ కిషోర్ బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 862 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జన సురాజ్ పార్టీ తరపున తొలిసారిగా బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్, బీజేపీ నుంచి ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటారా? లేదా అన్నదానిపై అందరి దృష్టి నెలకొంది. బంకీపూర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. జూలై 30న జరిగిన ఉప ఎన్నికలో 34.30 శాతం ఓటింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 41.45 శాతంతో పోలిస్తే ఇది ఏడు శాతానికి పైగా తక్కువ.  బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఈసారి మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నవంబర్ 2025లో తన సమీప ప్రత్యర్థి అయిన ఆర్జేడీ (RJD)కి చెందిన రేఖా గుప్తాపై 50,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించిన నబిన్ వరుసగా ఐదవసారి అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు.