హైదరాబాద్ మాజీ మేయర్ సోదరి మిస్సింగ్.. పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: తన సోదరి కె. నమ్రత కనిపించడం లేదని గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి(Former GHMC Mayor Vijayalakshmi) పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నివాసి అయిన నమ్రత, జూన్ 4వ తేదీన ఉదయం సుమారు 10 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లారని, ఆమె తిరిగి రాకపోవడంతోనూ, బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతోనూ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో(Banjara Hills Police Station) ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో ఆమె సతీష్ (35), సత్యనారాయణ (45), కుమారి (45) అనే ముగ్గురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ, వారిని విచారిస్తే నమ్రత అదృశ్యం వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి రావచ్చని తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ, అనుమానితుల వివరాలను సేకరిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు రెండవ కుమార్తె. నమ్రత ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉంటూ, రాజకీయాలు, మీడియాకు దూరంగా తన వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యారని విజయలక్ష్మి తెలిపారు.






